సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిస్థితే అందుకు ఉదాహరణ. పార్టీ లేదు.. బొక్కా లేదు అని, ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి అని ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు రాష్ట్ర అధ్యక్షుడే అయినా జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న వారు కనీసం ఆయనను సంప్రదించడం లేదు. పైగా అచ్చెన్న పేరు చెప్పుకుని అధిష్టానం వద్దకు వెళ్తే సీటు గల్లంతే అన్న నిర్ణయానికి వచ్చేశారు. మరీ ముఖ్యంగా లోకేష్ ‘అచ్చెన్న అనుచరుడు’ అని ముద్ర ఉన్న వారిని ప్రత్యేకంగా గమనిస్తున్నారని, దీనిపై ఆరా తీసే బాధ్యతను కూడా కళా వెంకటరావు తదితర నేతలకు అప్పగించారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు అచ్చెన్న ప్రమేయం లేకుండా లోకేష్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నారు.
చేటు తెచ్చిన మాట..
లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదంటూ ఫోన్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు...తనకు సమకాలీనులైన నాయకుల వద్ద లోకేష్‌పై మాట్లాడిన తీరు.. అన్నీ కలిపి ఇప్పుడు ఆయనపై గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీని, తనను బదనాం చేసిన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు అచ్చెన్నాయుడుపై వేటేస్తే పార్టీకి ఇబ్బంది అని వేచి చూస్తూనే.. వ్యక్తిగతంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీలో అచ్చెన్నాయుడు మాటకు విలువ లేకుండా చేయడంతో పాటు ఆయన అనుచరులుగా పార్టీ టిక్కెట్ ఆశించే వారికి మొండి చేయి చూపే విధంగా లోకేష్ పావులు కదుపుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో అచ్చెన్న పేరు చెప్పుకుని టిక్కెట్ అడిగేందుకు ఆశావహులు సాహసించలేకపోతున్నారు.
వాస్తవంగా ఈ సారి ఎన్నికల్లో పాతపట్నం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకున్న అంతర్గత విభేదాల కారణంగా సీట్ల కేటాయింపు విషయంలో నిర్ణయా లు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షు డి హోదాలో అచ్చెన్నాయుడును వెంటబెట్టుకుని అధిష్టానం వద్ద ప్రయత్నాలు సాగించాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టిక్కెట్ కోసం అచ్చెన్నాయుడు వ్యతిరేక వర్గంగా నిలిచిన లోకేష్ అనుచరులతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కళా వెంకటరావుతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత కూన రవికుమార్ ద్వారా యత్నాలు సాగిస్తున్నారు.. వీరిద్దరూ లోకేష్ తో బాగా టచ్‌లో ఉన్నారు. చెప్పాలంటే అచ్చెన్నకు పోటీగా లోకేషే వీరిని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం.
జిల్లాలో ఏం జరిగినా లోకేష్‌కు ఇట్టే సమాచారం ఇస్తున్నారు. అచ్చెన్నతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న నేతలెవరో చెప్పే బాధ్యతను తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికంతటికీ తిరుపతి లోకసభ ఉప ఎన్నికల సమయంలో లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే కారణమని చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చెప్పిన మనషులకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని, కాస్తో కూస్తో ఎంపీ రామ్మోహన్‌నాయుడు చెప్పినోళ్లకై నా ప్రాధాన్యత ఇస్తారేమో గాని అచ్చెన్నాయుడు సిఫా ర్సు చేసే వ్యక్తులకు ఛాన్సే లేదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీంతో అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లడానికి, ఆయన సిఫార్సులతో టిక్కెట్ కోసం ప్రయత్నించడానికి జిల్లాలోనే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల తర్వాత అచ్చెన్నను పూర్తిగా అణగదొక్కడానికి లోకేష్ ప్రణాళిక సిద్ధం చేశారని పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment