సాక్షి, తిరువనంతపురం : 2024 ఏడాదిని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ పొలిటికల్ ఇయర్‌గానే భావిస్తున్నాయి. దేశ నేతలు, ప్రజలందరి దృష్టి రాబోయే లోక్‌సభ సమరంపైనే ఉంది. 2023లో 5 రాష్ట్రాల ఎన్నికల తంతు ముగియగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించి రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలోనూ అత్యధిక స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాషాయ పార్టీ. అందుకు తగ్గట్లుగానే వ్యూహరచన చేస్తోంది.
ఇందులో భాగంగా వామపక్ష భావజాలం ఉన్న కేరళపై గురిపెట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. కేరళలో మాత్రం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. అయితే, కాంగ్రెస్ లోక్‌సభ స్థానానికి కంచుకోటగా ఉన్న తిరువనంతపురాన్ని బద్దలు కొట్టాలని చూస్తోంది. రాజకీయ చైతన్యం కలిగిన కేరళలో బీజేపీ గెలిచి.. దక్షిణాదిలో తమకు తిరుగు లేదని నిరూపించాలని యోచిస్తోంది.
గెలపుపై కాషాయం నేతల ధీమా
తాజాగా ప్రకటించిన బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో తిరువనంతపురం సీటును కేంద్ర మంత్రికి కేటాయించింది. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేని కేరళలో కూడా తామే గెలుస్తామని కాషాయం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శశి థరూర్‌పై కేంద్ర మంత్రి..
కాబట్టే కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభ స్థానం పోటీ చేయడం ఇదే తొలిసారి.
గెలుపు గుర్రాలపై ఆసక్తి..
ఇక తిరువనంతపురం లోక్‌సభ గెలుపు గుర్రాలపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఏడాది జనవరిలో కేరళ బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్‌ని ఓడించడం కష్టమని అన్నారు. అందుకే థరూర్ తిరువనంతపురం నుండి పదే పదే గెలుస్తున్నారు. భవిష్యత్తులో అదే స్థానంలో శశిథరూర్ కాకుండా మరో నాయకుడు గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
టార్గెట్ దక్షిణాది
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో శ్రమిస్తోంది. 2019లో దేశం మొత్తం 303 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఏడాది దక్షిణాదిలో 129 లోక్‌సభ స్థానాల్లో (పుదుచ్చేరితో కలిపి 130) బీజేపీ కేవలం 29 సీట్లకే పరిమితమైంది. ఈ సారి ఆసంఖ్యను మరింత పెంచేలా దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నేసింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కమలం అగ్రనేతల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సైతం వరుస పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ పర్యటనల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment