తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేరళ రాజకీయం వేడెక్కుతుంది. తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్.. అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ అభ్యర్ధి శశిథరూర్‌కు లీగల్ నోటీసులు పంపారు. శశిథరూర్ తనకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేరళకు మలయాళ మీడియా సంస్థ న్యూస్24 ఇంటర్వ్యూలో శశిథరూర్.. రాజీవ్ చంద్రశేఖర్ గురించి మాట్లాడారు. ఏప్రిల్ 6న సదరు టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజీవ్ చంద్రశేఖర్ ఓటర్లను, ఓ వర్గానికి చెందిన మత పెద్దలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తరుపున లాయర్ ద్వారా శశిథరూర్‌కు లీగల్ నోటీసులు అందించారు.
నేనే షాకయ్యా
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఓటర్లకు డబ్బులిస్తూ ప్రలోభ పెడుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు నన్ను షాక్‌కి గురి చేశాయని ఆ నోటీసుల్లో రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
క్షమాపణలు చెప్తారా? లేదంటే
ఈ నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపు శశిథరూర్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. అంతేకాదు తనకు, ఓటర్లకు, ఓ కమ్యూనిటీని కించపరిచినందుకు ఆ వర్గానికి చెందిన ప్రజలకు, మత పెద్దలకు బహిరంగంగా క్షమాణలు చెప్పాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశిథరూర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
రాజకీయంగా లబ్ధి పొందాలనే
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా దుర్మార్గపు ఉద్దేశ్యంతో తన క్లయింట్ రాజీవ్ చంద్రశేఖర్ పరువుకు నష్టం వాటిల్లేలా అసత్యప్రచారం చేశారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, శశిథరూర్ క్షమాపణలు చెప్పాలని రాజీవ్ చంద్రశేఖర్ తరుపు న్యాయవాది శశిథరూర్‌కు పంపిన నోటీసుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment