చెనై: జాబ్ రాకెట్ కుంభకోణంలో డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేయడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. బాలాజీ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజకీయంగా ఎదుర్కోలేక.. త్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. మంత్రి అరెస్ట్ అనంతరం బీజేపీపై కౌంటర్ అటాక్‌కు దిగారు సీఎం స్టాలిన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను మదురై పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(a), 505 (1)(b), 505 (1)(c).. ఐటీ చట్టం 66(d) ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు అతన్ని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా మధురై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఎం) ఎంపీ సు వెంకటేశన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఎస్జీ సూర్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అధికారుల మాత్రం బీజేపీ నేత అరెస్టుకు గల సరైన కారణాన్ని వెల్లడించలేదు.
విశ్వనాథన్ అనే కమ్యూనిస్ట్ కౌన్సిలర్ మలంతో నిండిన కాలువను శుభ్రం చేయమని పారిశుధ్య కార్మికుడిని బలవంతం చేశారని, ఫలితంగా అలెర్జీ కారణంగా కార్మికుడు మరణించాడని సూర్య ఆరోపించారు. ఈ మేరకు ఈ సంఘటనను తీవ్రంగా విమర్శిస్తూ ఎంపీ వెంకటేశన్‌కు రాసిన లేఖ రాశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీ వేర్పాటువాద రాజకీయాలు ఆ మురికి గుంట కంటే హీనంగా కంపు కొడుతున్నాయి. మనిషిగా బ్రతకడానికి మార్గం కనుక్కోండి మిత్రమా’ అంటూ విశ్వనాథన్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సూర్యను అరెస్ట్ చేసినట్లు సమాచారం
చదవండి: బలహీనపడిన బిపర్‌జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం
సూర్య అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జి సూర్యను రాత్రికి రాత్రే అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది చట్ట విరుద్ధమన, సామాజిక సమస్యలపై డీఎంకే దాని కూటమి పార్టీ కమ్యూనిస్టు ద్వంద్వ వైఖరిని విమర్శించినందుకే అతన్ని అరెస్టు చేశారంటూ ట్విటర్‌లో ఆరోపించారు. తమ విమర్శలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి వారి గొంతులను మూయించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారిని అరెస్ట్ చేసే అప్రజాస్వామిక ధోరణి రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘విమర్శలను ఎదుర్కోలేక బీజేపీ కార్యకర్తలను నిరంతరం అరెస్టు చేయడం నిరంకుశ పోకడకు నిదర్శనం. ఇలాంటి అణచివేతలతో కాషాయ శ్రేణులు వెనక్కి తగ్గరు. ప్రజల కోసం మా గొంతు ఎప్పుడూ ధైర్యంగా మోగుతుంది. ప్రశ్నించే గొంతులన్నింటినీ అణచివేయడానికి ప్రయత్నిస్తే ఎక్కువకాలం ప్రజాస్వామ్యంలో కొనసాగలేరనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి’ అని అన్నామలై ట్విటర్‌లో పేర్కొన్నారు.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి డీఎంకే నేత, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ ఇటీవల అరెస్ట్ చేసిన మూడు రోజులకే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment