పేరుకు సొంత జిల్లా అయినా చంద్రబాబుకు ఏనాడూ ప్రజల మద్దతు దక్కలేదు.. పొత్తుల పేరుతో ఇతర పార్టీలతో కలిసి వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు.. అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని యత్నించినా ప్రయోజనం చేకూరలేదు.. మళ్లీ పాత కథే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో టీడీపీ అధినేతకు దిక్కుతోచడం లేదు. అసలే బలమైన అభ్యర్థులు లేక ఆందోళన చెందుతున్న బాబుగారికి భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఎలాగైనా విజయావకాశాలు మెరుగుపరుచుకోవాలనే దురాలోచన చేస్తున్నట్లు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చివరకు టీడీపీ.. జనసేన నేతల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చివరకు టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారు. కీలకమైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. పొత్తులో భాగంగా పై మూడు స్థానాలను జనసేన కోరకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలిసిందే. తన నైజానికి తగ్గట్టు చంద్రబాబు ఆయా స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చినా, వీటిని వదులు కోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా ఈ స్థానాల్లో కూడా తమ అభ్యర్థులనే బరిలోకి దింపాలని టీడీపీ అంతర్గత సమావేశంలో నిర్ణయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అందులో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. నేడో, రేపో చేరిక ఉండవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. జన బలమే కాదు.. పార్టీ కమిటీలకు దిక్కులేని జనసేన నాయకులమని చెప్పుకునే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మాత్రం ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నా పైకి మాత్రం భాయ్‌భాయ్ అని కలరింగ్ ఇచ్చుకు తిరుగుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన జనసేన నేతలతో పరిచయ కార్యక్రమంలో తలెత్తిన వివాదంపై పసుపులేటికి షోకాజ్ నోటీసు ఇవ్వడం వెనుక కిరణ్ రాయల్ హస్తం ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. మరికొందరికి సీటు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది.
భారంగా ‘రా కదలిరా’
అభ్యర్థుల విషయమే తేల్చకుండా.. చంద్రబాబు ‘రా కదలి రా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా, పచ్చ పత్రిలు, ఎల్లో ఛానళ్లలో తప్ప టీడీపీ గురించి పట్టించుకోని జనంలో పార్టీకి హైప్ తెచ్చేందుకే ఎన్నికల ముందు ఈ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘రా కదలిరా’ను అట్టహాసంగా చేపట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు హుకుం జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తలకు మించిన భారంగానే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చేసేది లేక ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ నుంచి తమ పార్టీలోకి పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతున్నాయని ప్రజలను నమ్మించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో కంటికి కనిపించిన వారిని పట్టుకువచ్చి పచ్చ కండువా కప్పేస్తున్నారు. వారందరూ వైఎస్సార్‌సీపీ నుంచి వలస వచ్చేస్తున్నారని కలరింగ్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం కుప్పం మండలం మల్లనూరు సమీపంలోని టి.సదుమురు, హెచ్.కొట్టాల గ్రామాలకి చెందిన పలువురిని తీసుకెళ్లి టీడీపీ కండువాలు కప్పేసి ఫొటోలకు ఫోజులిప్పించేశారు. తమ్ముళ్ల అవస్థలు పసిగట్టిన ప్రజలు బాహాటంగానే నవ్వుకుంటుండడం కొసమెరుపు.
చిత్తూరులో బాబు చిచ్చు
చిత్తూరులో టీడీపీ జెండా మోసేవారు కరువైన సమయంలో మాజీ మేయర్ కఠారి హేమలత, మరి కొందరు టీడీపీ శ్రేణులు పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిత్వం తమకే దక్కుతుందనుకున్న కఠారి హేమలత, బాలాజీ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. కొత్తగా జగన్‌మోహన్ అనే వ్యక్తిని రంగంలోకి దింపారు. కొంత కాలంగా జగన్‌మోహన్ చిత్తూరులోనే ఉంటూ ప్రజలకు రకరకాల బహుమతులు పంపిణీ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. చిత్తూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జగన్‌మోహన్‌కు సైతం చంద్రబాబు హ్యాండిచ్చేశారు.
తాజాగా డీకే ఆదికేశవులు నాయుడు బంధువులను రంగంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. చాలా కాలంగా బెంగళూరుకే పరిమితమైన డీకే కుటుంబీకులు కొద్ది రోజులుగా చిత్తూరు, శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యకు జనసేన కండువా కప్పించారు. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, టీడీపీ దివంగత నేత గురవయ్య నాయుడుకు ఈమె కోడలు. అందుకే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతం నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న బొజ్జల సుధీర్‌రెడ్డి అభ్యర్థిగా పనికిరాడని స్థానిక టీడీపీ నేతలు కొందరు చంద్రబాబుకు వెల్లడించినట్లు సమాచారం. అవగాహన రాహిత్యం, అసభ్య పదజాలంతో సుధీర్‌రెడ్డి మాట్లాడిన మాటలు, ప్రవర్తనపై బాబుకు వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొజ్జల సుధీర్ అభ్యర్థిగా పనికి రాడనే అభిప్రాయానికి ఆ పార్టీ అధినేత వచ్చినట్లు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చిత్తూరు విషయానికి వస్తే.. డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబంలోని వ్యక్తికే అభ్యర్థిత్వం ఇవ్వాలని భావించిన చంద్రబాబు.. తాజాగా మరో వ్యక్తికి ఫోన్‌చేసి టికెట్ ఆఫర్ చేసినట్లు తెలియడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment