
ఢిల్లీలో అమిత్ షా గుమ్మం వద్ద పడిగాపులు
పొత్తుల కోసం వచ్చిన తంటా..
శివరాత్రి.. దేశం యావత్తు శివనామ స్మరణతో తెల్లవార్లూ రెప్ప వేయకుండా జాగరణ చేసి.. ముక్తిని.. మోక్షాన్ని శివానుగ్రహాన్ని పొందేందుకు భక్తులు తాపత్రయ పడతారు. అయితే, రాజకీయ భక్తుడు చంద్రబాబు సైతం అచ్చం సాదా భక్తుడి మాదిరిగానే అమిత్ షా గుమ్మం ముందు వేళ్ళాడుతూ తెల్లవార్లూ రెప్ప వేయకుండా ఎదురుచూశారు. శివలింగాన్ని పట్టుకుని వదలని మార్కండేయుడి మాదిరి, చంద్రబాబు సైతం అమిత్ షా గుమ్మం వద్ద వేళ్ళాడుతూ తన భక్తిని చాటుకున్నారు. దీంతోబాటు అమిత్ షా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు సైతం చేసి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన భక్తుడి రూపంలో చంద్రబాబు పరివర్తన చెందారు.
ఇంత చేసినా ఢిల్లీ పెద్దలు కరుణించడం లేదు. ఆయన ఓ భస్మాసురుడు అన్నది బీజేపీకి తెలుసు. వరాలిచ్చిన ఈశ్వరుణ్నే అంతం చేయాలని చూసిన భస్మాసురుడికి చంద్రబాబుకు సారూప్యతలు ఉన్న సంగతి బీజేపీ మరచిపోలేదు. బీజేపీ అండతో.. వాజపేయి చలవతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత మోదీని, బీజేపీని ఎన్నెన్ని మాటలన్నది వాళ్లకు గుర్తుంది. ఆ తరువాత మోదీని ఉరితీయాలన్న అంశంతోబాటు 2019లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక మోదీని, అమిత్ షాను ఎన్నెన్ని మాటలన్నది సైతం వాళ్లకు గుర్తుంది.
వరం ఇచ్చేవరకూ ఒకలెక్క.. వరం అందుకున్నా సాక్షాత్తు శివయ్యను భస్మం చేసేందుకు భస్మాసురుతూ వేసిన ఎత్తులే అచ్చం చంద్రబాబు వేస్తున్నారన్నది బీజేపీ పెద్దలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆలయం ఎదుట నంది ఎదురుచూస్తున్న మాదిరి ఆయన్ను అమిత్ ఇంటి గుమ్మం వద్ద రెండ్రోజులపాటు వెయిట్ చేయించారు. ఎట్టకేలకు కాసేపటి క్రితమే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ వెళ్లి ఆయనను కలిశారు. వీరి భేటీలో భాగంగా పొత్తుల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగినట్టు సమాచారం.
మరోవైపు.. రెండు రోజుల పాటు చంద్రబాబు వేచి చూడటంపై సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు.. మీమ్స్, సెటైర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. మొత్తానికి దేశం మొత్తం శివరారాత్రిని ఒక తీరున జరుపుకోగా చంద్రబాబు మాత్రం బీజేపీని ప్రసన్నం చేసుకునే యత్నంలో నిద్రలేని రాత్రులు గడిపారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment