
రేణిగుంట (తిరుపతి): ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో ఊరేగిస్తాం. మాపైనే అక్రమ కేసులు పెడుతారా? రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోస్టింగులు నిర్ణయించేది నేనే. గుర్తుపెట్టుకో..’ అంటూ టీడీపీ నాయకుడు లోకేశ్ బెదిరింపులకు దిగారు. ఆయన నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చేరుకుంది.
అక్కడ మూడురోడ్ల కూడలి వద్ద ఆయన స్టూల్ వేసుకుని బహిరంగసభను తలపించేలా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో రేణిగుంట డీఎస్పీ రామచంద్ర ఆయన్ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోకేశ్ గట్టిగా గద్దిస్తూ ‘కేసులు పెట్టుకోబో.. ఏం తమాషానా.. రేపు అధికారంలోకి వచ్చేది మేమే.. పోస్టింగులు నిర్ణయించేది నేనే.. మా నాయకులపై దాడిచేసి తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా పెడుతున్నారు.
దాడిచేసిన వారిని కడ్రాయర్‌తో ఊరేగిస్తాం. డీఎన్‌ఏలో రాయలసీమ అనేది ఉంటే నాకు మైక్ ఇవ్వు. పిరికోడిలా ప్యాలెస్‌లో కూర్చోకుండా వచ్చి సమాధానం చెప్పు. మాకు పౌరుషం లేదనుకుంటున్నావా? మీసం తిప్పి చెబుతున్నా.. చంద్రబాబును ఒక్క చిటికె వేయమనండి.. వైఎస్సార్‌సీపీ ఉంటుందో.. లేదో.. నేను చూస్తా. గన్నవరంలో మా పార్టీ ఆఫీసుపై దాడిచేస్తే కేసు పెట్టరు.
నేను ఇక్కడ స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసు పెడతారా? బ్లాక్ అండ్ వైట్ పేపర్లు హెలికాప్టర్‌లో నుంచి విసిరితే ఏమవుతుంది..’ అన్నారు. అంతకుముందు రాజులకండ్రిగ సమీపంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఎస్‌ఎస్ కెనాల్ పూర్తిచేస్తామని చెప్పారు.