సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, దాని మిత్ర పక్షం మజ్లిస్ సైతం స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని ప్రకటించింది. గడువు ముగియడంతో ఆయన స్పీకర్ కావడం ఖాయమైంది.
శాసనసభ స్పీకర్ ఎన్నిక నామినేషన్ల కోసం ఇవాళే ఆఖరి రోజుకాగా.. ఒకే ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ప్రొటెం స్పీకర్ రేపు(గురువారం డిసెంబర్ 14)న శాసన సభలో స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు.
గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment