
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఉపఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ నిలిపేయదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే ‘దళితబంధు’పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం పేరుతోదళితులను మరోసారి మోసం చేసినందుకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్ధిదారుకు కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసి, తాజాగా మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి మరో డ్రామాకు తెరలేపారని సంజయ్ మండిపడ్డారు. ఈ పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో సంజయ్ పైవిధంగా స్పందించారు. దళితబంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్నా, వాటిని డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్ చేశారని మండిపడ్డారు.
ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్ ఆ తరువాత మాటమార్చి షరతులు విధించారని ఆరోపించారు. దళితులను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారని, దళితుడిని సీఎం చేస్తానని, వారికి మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను గాలికొదిలేయడమేకాక, తాజాగా దళితబంధు స్కీంను నిలిపివేయడానికి ఆస్కారమివ్వడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.