సాక్షి , న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరూ తన పాలనపై ప్రశ్నించకుండా ఉండేందుకే ఇలాంటి డ్రామాలను కేసీఆర్ ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా కేం ద్రమే చెల్లిస్తోందని చెప్పారు.
భవిష్యత్తులోనూ తెలంగాణ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కేవలం బ్రోకరిజమేనని సంజయ్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సహచర ఎంపీ ధర్మపురి అరవింద్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వయసు పెరిగి మతి తప్పింది..
సీఎం కేసీఆర్‌కు వయసు పెరిగి మతి తప్పిన కారణంగా గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారన్నారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా, విధివిధానాల్లేవని గోయల్ తెలిపారన్నారు.
ఇన్నాళ్లూ బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి వడ్లే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడమీద కత్తిపెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చానంటూ కేసీఆర్ అబద్ధాలాడుతున్నారని సంజయ్ విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో కేసీఆర్ ఎందుకు డ్రామాలాడుతున్నారని, కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు అడగలేదని నిలదీశారు.
ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్
ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని, మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడినట్టుగా తమ దగ్గర సమాచారం ఉందని సంజయ్ చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే.. విచారణలో నిజమేనని తేలిందని, అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
కేసీఆర్‌కు రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరించిన కేసీఆర్.. తన ఫాంహౌస్‌లో వరి పంట వేసి కోటీశ్వరుడయ్యాడని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment