సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ తల్లి రోదిస్తోంది. గడీలో బందీ అయింది. సీఎం కేసీఆర్ పాలనలో అష్టకష్టాలు పడుతోంది. తెలంగాణతల్లి బంధవిముక్తికి, గడీల పాలనను బద్దలుకొట్టడానికి బీజేపీ కార్యకర్తలు కదం తొక్కుతున్నరు. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం మీకూ వచ్చింది. తెలంగాణ బిడ్డలుగా మేం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిచ్చి మాతృభూమి రుణం తీర్చుకోండి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమెరికాలోని ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం తెల్లవారుజామున ‘ఏక్ దక్కా – తెలంగాణ పక్కా’అనే అంశంపై అమెరికాలోని ప్రవాస తెలంగాణప్రజలతో నిర్వహించిన జూమ్ çసమావేశంలో సంజయ్ మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా యుద్ధం చేస్తున్నామని చెప్పారు. గొల్లకొండ కోటపై కాషాయజెండాను రెపరెపలాడించి తీరుతామని పునరుద్ఘాటించారు. బీజేపీ మహోద్యమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని కోరారు.జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏప్రిల్ 14 నుంచి చేపడుతున్న పాదయాత్రకు సహకరించాలని కోరారు.
14న ‘బండి’ పాదయాత్రకు అమిత్ షా!
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 14న జోగులాంబ ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న రెండో విడత ప్రజాసంగ్రామయాత్ర ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. అలాగే, ఏప్రిల్ 1న కర్ణాటకలో జరిగే పార్టీ కార్యక్రమానికి వెళ్తూ.. ప్రధాని మోదీ లేదా అమిత్‌షాలలో ఒకరు హైదరాబాద్ వస్తారని కూడా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కాగా, సంజయ్ పాదయాత్రను 25 రోజుల పాటు రోజుకు దాదాపు 12 కి.మీ లెక్కన మొత్తం 300 కి.మీ మేర నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో పాదయాత్ర సాగనుంది. హోంమంత్రి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో యాత్ర ప్రారంభ కార్యక్రమానికి రాలేని పక్షంలో యాత్రలో భాగంగా జరిగే పెద్ద బహిరంగసభల కేంద్రాలు, తేదీలను తెలపాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అమిత్‌షా కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం. 14న అమిత్‌షా వచ్చే పరిస్థితి లేకపోతే మధ్యలో మహబూబ్‌నగర్ లేదా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగసభ, లేదా పాదయాత్ర ముగింపు సందర్భంగా మహేశ్వరంలో నిర్వహించే బహిరంగసభలో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment