సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా ప్రజాసంక్షేమాన్ని మరిచి నిరంకుశత్వంతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు తెరదించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. మునుగోడు సమర భేరిలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వనున్నారని తెలిపారు.
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ‘మునుగోడు సమర భేరి’బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కానుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తరుణ్ ఛుగ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మునుగోడు సమర భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఛుగ్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ విషయంలో నైతిక విజయం సాధించాం..
అమిత్ షా మునుగోడు సభకు భయపడే సీఎం కేసీఆర్ శనివారం మునుగోడులో బహిరంగ సభ నిర్వహించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను భయపెట్టి ఫామ్‌హౌస్ నుంచి బయటకు రప్పించగలగడం బీజేపీ నైతిక విజయమని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టానికి తెరలేపనుందన్నారు.
బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని ఛుగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment