సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదో నిజాం ప్రభువుగా గద్దెనెక్కి కూర్చున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ గ్లోబల్ రాష్ట్ర సమితిగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 2007లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాస్‌పోర్టు కుంభకోణంలో ఇరుక్కున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జైరామ్ రమేశ్ మంగళవారం జోడోయాత్ర సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోడ్లు చూస్తేనే పరిస్థితేంటో అర్థమవుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.
ఎంఐఎంకు ఆక్సిజన్ అవసరం
హైదరాబాద్ పార్టీ ఎంఐఎం రాజకీయంగా బతికుండేందుకు ఆక్సిజన్ అవసరమని, గతంలో కాంగ్రెస్ ఆక్సిజన్‌తో ఎంఐఎం రాజకీయ జీవనం సాగించిందని జైరామ్ రమేశ్ చెప్పారు. ఎంఐఎం ప్రస్తుతం బీజేపీ ఆక్సిజన్‌తో ముందుకు సాగుతూ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ బూస్టర్ డోస్ అందిస్తోందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు ముందుకొచ్చి బీజేపీకి సహకరిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ఎంఐఎంకు విడాకులు ఇచ్చిందని, మళ్లీ కలిసే సమస్యే లేదని స్పష్టంచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పుట్టిందని, బీజేపీ, ఆప్ భావజాలంలో తేడా లేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎంఐఎం మాదిరిగా ఆప్ కూడా బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ ఆధారంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు ఉంటాయన్నారు.
రాహుల్ వెళ్లని రాష్ట్రాల్లోనూ యాత్ర
భారత్ జోడో రాహుల్ యాత్ర వెళ్లని రాష్ట్రాల్లో సైతం స్థానిక నాయకులతో జోడోయాత్ర కొనసాగుతుందని జైరామ్ రమేశ్ వెల్లడించారు. ఇప్పటికే ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈవిధంగా ప్రారంభమైందని.. పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రకు ఏఐసీసీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment