MLC Elections 2021 Telangana, Polling Live Updates In Telugu | Graduate MLC Elections In Telangana 2021 - Sakshi
Sakshi News home page

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

Published Sun, Mar 14 2021 8:13 AM | Last Updated on Sun, Mar 14 2021 4:23 PM

Telangana Graduate MLC Elections 2021 Polling Live Updates  - Sakshi

Time 4.00
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లతో బారులు తీరిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. 

జనగామ: జనగామ జిల్లాలో పోలింగ్ స్టేషన్లలో పెరుగుతున్న ఓటర్ల రద్దీ. గంటల తరబడి నిరీక్షిస్తున్న ఓటర్లు. ఒక్కో ఓటుకు ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుండటంతో  మహిళా ఓటర్లు అవస్థలు పడుతున్నారు. దీంతో ఓటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.



ఖమ్మం: మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురులో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డబ్బులు పంచుతున్నారనే అనే సమాచారంతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పోలీసుల ముందే టీఆర్ఎస్ నాయకులు ఇటుకలతో దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన  ప్రేమేందర్ రెడ్డిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వరంగల్:  వరంగల్‌లోని‌ శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నరేందర్ సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.

సాక్షి, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు ఓటు వేయడానికి పట్టభద్రులు బారులు తీరారు. మండలంలో ఉన్న మొత్తం 1948 ఓట్లకు సంబందించి ఒకే సారి ఓట్లు వేయడానికి పట్టభద్రులు వచ్చారు. రెండే పోలింగ్ బూత్‌లు ఉండడంతో 4 గంటలు అయిన కేవలం 350 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో సరియైన సదుపాయాలు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు (ఆదివారం, మార్చి14) ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆయన సతీమణి మమత.

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ  యువ తెలంగాణ పార్టీ  అభ్యర్ధి రాణి రుద్రమ  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్, సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కును వినియోగించు కున్నారు.  అంతకుముందు వరంగల్ జిల్లా మల్లికుదుర్ల గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం  చేసుకొన్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో రవాణా శాఖా మంత్రి  పువ్వాడ అజయ్‌  కుమార్‌ ఖమ్మంలో ఓటు వేశారు.
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.


బంజారాహిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో నగర మేయర్‌ విజయలక్ష్మి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.  అలాగే మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవియాదవ్‌ దంపతులు  షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రంలో  ఓటు వేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా: ఇటిక్యాల మండలం కేంద్రంలో 129 బూత్ లో ఓటు వేసిన ఢిల్లీ అధికార ప్రతినిధి అభ్యర్థి మందా జగన్నాథం
జోగులాంబ గద్వాల జిల్లాఇటిక్యాల మండలం కేంద్రంలో 30 బూత్ లో ఓటు వేసిన ఎమ్మెల్యే  అబ్రహం
ఖమ్మం : నగరంలోని శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో  ఓటు హక్కు వినియోగించుకున్న  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఓటు వేశారు. అలాగే మోడ్రన్ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ వెంకట్ రావ్.

వనపర్తి జిల్లా : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి
నారాయణపేట జిల్లా : మక్తల్ బాలుర ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా తమ ఓటు వేసినఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  డీసీసీబీ ఛైర్మెన్ నిజాం పాషా

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, షేక్​పేట్​ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యావంతులు  ఓటు హక్కును వినియోగించుకోవాలని, తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచి బాధ్యతను చాటుకోవాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.  ఓ మహానుభావుడు చెప్పినట్లు ఇంట్లో బయల్దేరేటపుడు గ్యాస్ సిలిండర్‌కు నమస్తే చెప్పి బయల్దేరి విద్యావంతులకు ఓటు వేశానంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఖమ్మం జిల్లా : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ :  ఓటు హక్కు వినియోగించుకోనున్న లక్ష 29వేల 854 మంది ఓటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 189 పోలింగ్ కేంద్రాలు...ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొలింగ్ కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు.

సూర్యాపేట జిల్లా :  సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సతీ సమేతంగా  ఓటువేసిన మంత్రి జగదీష్ రెడ్డి

ఓల్డ్‌ మలక్‌పేటలోని అగ్రికల్చర్‌ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ- ఖమ్మం-వరంగల్‌ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు  ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్‌’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్‌ పేపర్లు, జంబో బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్‌’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సదుపాయం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement