చింతకాని/నేలకొండపల్లి: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న హత్యలుగానే భావించాలని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా, భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుండగా... కేసీఆర్ బిడ్డలు మాత్రం రాచరికం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయటం చేతకాని సీఎం కేసీఆర్ రాజీనామా చేసి, దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కాగా, రానున్న ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తారని వైఎస్సార్ టీపీ రాష్ట్ర పరిశీలకుడు బీరెవెల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment