సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది.
ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి.
కాంగ్రెస్‌కే తుమ్మల అనుచరులు జై..
పాలేరు బీఅర్ఎస్‌లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం.
కాగా, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్ ప్రగతిభవన్‌కు వెళ్లి టికెట్ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది.
Comments
Please login to add a commentAdd a comment