
బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోయినా.. పాలేరు నుంచే పోటీ చేయాలనే ఉద్దేశంతో..
సాక్షి, ఖమ్మం: ప్రజల నిర్ణయం మేరకు పాలేరు నుంచే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ఆయన తనయుడు యుగంధర్ ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఖమ్మంలో భారీ కాన్వాయ్‌తో తుమ్మలకు ఘన స్వాగతం పలకగా.. యుగంధర్ అక్కడి మీడియాతో మాట్లాడారు.
అనుచరులతో మాట్లాడి తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రజల నిర్ణయం మేరకే పాలేరు నుంచి ఆయన పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచి సీతారామా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ఆయన అభిమతం అని తనయుడు తుమ్మల యుగంధర్ ప్రకటించారు.
బీఆర్‌ఎస్ తరపున పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల.. గత మూడు నాలుగు రోజులుగా అనుచరులతో హైదరాబాద్ నుంచే చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన పార్టీ నుంచి జారిపోకుండా అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేయించారు. ఎంపీ నామా నాగేశ్వరరావును దూతగా పంపి.. తుమ్మలను నిలువరించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి.
అయితే అందుకు తుమ్మల ఎలా స్పందించారో తెలియదుగానీ.. పాలేరు నుంచే పోటీ చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తాజాగా ఆయన తనయుడి ప్రకటన చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఒకవేళ అదే జరిగినా ఖమ్మం నుంచే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: భావోద్వేగంతో తుమ్మల కన్నీటి పర్యంతం