సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తాను మద్దతిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి చెప్పారు. మొదటి నుంచీ తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలోనే తన స్టాండ్ చెబితే తెలంగాణ ద్రోహి అన్నారని, మరి ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడిన జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది కేసీఆరేనని, అందులో ఎలాంటి అనుమానం లేదన్న జగ్గారెడ్డి టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ అయోమయానికి దారితీసే విధంగా ఉన్నాయన్నారు. ఆయన మాటల వెనుక నిగూఢార్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని మొదటి నుంచి కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ గోడ మీద పిల్లిలా ఎటు వీలుంటే అటు మాట్లాడుతుందని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భంలో అనివార్య పరిస్థితుల్లో అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వక తప్పలేదని పేర్కొన్నారు.
ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారని, ఆత్మబలిదానాలు చేసుకున్న వారు కోరుకున్నట్టు తెలంగాణ లేదని అన్నారు. సమైక్య రాష్ట్రమంటూ రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొత్త డ్రామా మొదలు పెట్టాయని, కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, తన అభిప్రాయాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పారు.
రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నారని ఆయన అభిప్రాయానికి, తన వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను గతంలో కూడా రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పలేదని, పార్టీకి, పార్టీ ఇన్‌చార్జికి మాత్రమే చెప్పానని, అలాంటి సందర్భం కూడా రాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment