తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎమ్.పి పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ ఎన్నికల రాజకీయాలలోకి వచ్చి ఇప్పటికీ కొనసాగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరసగా గెలుస్తున్నారు. ఆ రకంగా ఇప్పటికి అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండడం విశేషం. ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహించి ఈ రకంగా ప్రభావితం చేయగలగడం చెప్పుకోదగ్గ అంశమే అవుతుంది.
►ప్రస్తుతం దేశ వ్యాప్త పార్టీగా మార్చి ఆయా రాష్ట్రాలలో తమ పార్టీ అభ్యర్దులను నిలబెట్టగలుగుతున్నారు. కొన్ని చోట్ల విజయాలు కూడా సాధిస్తున్నారు. సలావుద్దీన్ 1962 నుంచి ఐదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎమ్.పిగాను హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరసగా ఐదుసార్లు గెలిచారు. 1999లో తండ్రి లోక్ సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారన్నమాట. అలాగే తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నెండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిద్యం వహించారు.రెండు తెలుగురాష్ట్రాలలో ఇది ఒక అరుదైన రికార్డే అని చెప్పాలి.
►తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాజకీయాలలో గత రెండు దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉందనే చెప్పాలి. 1983 నుంచి కేసీఆర్ ఎన్నికల రాజకీయాలలో ఉన్నారు. ఆయన కుమారుడు కె.తారక రామారావు 2009 లో ప్రవేశించారు. కేసీఆర్ కుమార్తె కవిత 2014 లో నిజామాబాద్ నుంచి ఒకసారి ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్ రెండు ఉప ఎన్నికలతో సహా ఐదుసార్లు లోక్ సభకు , ఒక ఉప ఎన్నికతో సహా ఎనిమిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేటీఆర్ ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి నెగ్గారు. తండ్రి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మూడు ఉప ఎన్నికలతో సహా ఏడుసార్లు సిద్దిపేట నుంచి గెలుపొందారు.హరీష్ కూడా కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. ఇంతవరకు కేసీఆర్ , ఆయన కుమారుడు కలిసి పన్నెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
►గద్వాల నుంచి డి.కె. కుటుంబం కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాలలో కొనసాగుతోంది. డి.కె.సత్యారెడ్డి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నిక కాగా, ఆయన కుమారుడు సమరసింహారెడ్డి నాలుగుసార్లు గెలిచారు. మరో కుమారుడు డి.కె.భరత సింహారెడ్డి ఒకసారి, భరత్ భార్య డి.కె. అరుణ మూడుసార్లు అసెంబ్లీకి గెలిచారు. సమర, భరత్ లు ఒకసారి పరస్పరం పోటీ పడ్డారు. సమర సింహారెడ్డి అంత యాక్టివ్ గా రాజకీయాలలో లేరు. డి.కె. అరుణ కాంగ్రెస్ ను వీడి బిజెపిలో జాతీయ ఉపాధ్యక్షురాలి గా పదవిలో ఉన్నారు. సమరసింహారెడ్డి, అరుణలు మంత్రి పదవులు పొందారు. డి.కె. కుటుంబానికి మేనల్లుడు అయిన బిఆర్ఎస్ పక్షాన కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అరుణ తండ్రి సి.నర్సిరెడ్డి మక్తల్ నుంచి మూడుసార్లు గెలుపొందగా, ఆయన కుమారుడు రామ్మోహన్ రెడ్డి మూడుసార్లు ఎన్నికయ్యారు.
►భార్యా భర్తలు ఇద్దరూ ఒకేసారి శాసనసభలో ఉండడం అరుదుగా జరుగుతుంది. 1950 వ దశకంలో ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి, ఆమె భర్త రామచంద్రారెడ్డి ఒకేసారి అసెంబ్లీలో ఉండడం విశేషం.వీరిద్దరూ కమ్యూనిస్టు పార్టీ తరపున ఎన్నికయ్యారు. రామచంద్రారెడ్డి భువనగిరి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009లో కొత్తకోట దయాకరరెడ్డి, ఆయన భార్య సీత ఒకసారి శాసనసభలో ఉన్నారు. దయాకరరెడ్డి 1994,99 లలో అమరచింత నుంచి రెండుసార్లు, 2009లో మక్తల్ నుంచి ఒకసారి , సీత 2009లో దేవరకద్ర నుంచి గెలుపొందారు. వీరిద్దరూ టీడీపీ నుంచి గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి లు 2014లో ఒకేసారి శాసనసభ లో ఉన్నారు. ఉత్తం హుజూర్ నగర్ నుంచి ,పద్మావతి కోదాడ నుంచి గెలుపొందారు. ఉత్తం కోదాడ, హుజూర్ నగర్ లలో ఐదుసార్లు గెలిచారు. ప్రస్తుతం లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment