రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా? | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?

Published Sun, May 5 2024 3:18 AM

Union Minister Kishan Reddy challenges CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌

కొడంగల్‌ సహా ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు నేను రెడీ

యూపీఏ, ఎన్డీఏ పాలనలో తెలంగాణకు వచ్చిన నిధులపై చర్చకు రావాలని పిలుపు

ఆధారాలతో సహా ప్రజల ముందు చర్చిద్దామంటూ బహిరంగ లేఖ

మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుదామని సూచన..  సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్‌ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్‌ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. 

ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్‌ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

 స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్‌ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్‌ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.

‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..
‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్‌లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్‌రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. 

అబద్ధాల ప్రచారం సరికాదు..
‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే
‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 

1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌ ప్లాంట్‌ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement