ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన 8.34 లక్షల మెట్రిక్ టన్నుల రబీ బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇంకా ఇవ్వలేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ 1.34 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్‌తోపాటు 7 ఎల్‌ఎంటీ ముడిబియ్యాన్ని తీసుకొనేందుకు కేంద్రం ఇప్పటికే ఆరుసార్లు టార్గెట్ పొడిగించిందని తెలిపారు. 2020–21 రబీ సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని తాను చెప్పానని పేర్కొన్నారు.
ఆ అగ్రిమెంట్‌లో మిగులు బాయిల్డ్ రైస్ ఉంటే, వాటిని కూడా కొనుగోలు చేస్తామని గతంలో తాను చెప్పానన్నారు. అయితే ఇచ్చిన టార్గెట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇంత పంట పండలేదా? సేకరించి బ్లాక్‌లో అమ్ముకున్నారా? లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేసుకున్నారా? అసలు ఏమైందో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. టార్గెట్‌ను సకాలంలో సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ప్రగల్భాలు పలికి, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గిందో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి విచిత్రంగా ఉందన్నారు. అయితే మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. గతేడాది భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ రాసిచ్చిన మాట నిజమా కాదా? అని నిలదీశారు. గిట్టుబాటు ధర లేకపోతే రైతు సమన్వయ సమితులు కొంటాయని గతంలో కేసీఆర్ చెప్పారని, సమితులు ఉన్నాయో లేవో తెలియదు కానీ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రం ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఎంఎస్పీ పెంచడమే రైతు వ్యతిరేక విధానమా?
ఢిల్లీలో చేసినది రైతు దీక్ష, రైతు పోరాటం ఏమాత్రం కాదని, ఇది కేవలం రాజకీయ ఆరాటం, అధికారం నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నం మాత్రమే అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాకుండా పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘కనీస మద్ధతుధర పెంచడమే మా పొరపాటా? ఇదే రైతు వ్యతిరేక విధానమా? దేశంలో ఒకే విధానం ఉంది. ప్రధాని మోదీకి కేసీఆర్‌ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే 2024లో టచ్ చేసి చూపిస్తారు’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని, గవర్నర్ వ్యవస్థపై కత్తులు నూరడం సరికాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment