సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది.
సమాజ్‌వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment