నిధులను దారిమళ్లించిన నేతలను శిక్షించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన సొమ్మును కాంగ్రెస్ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌గా చెప్తున్న ఈ కుంభకోణంలో నిధులను దారి మళ్లించి వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని బుధవారం ‘ఎక్స్’వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ‘వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రను కీలక సూత్రధారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిïÙట్‌లో నిర్ధారించింది.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన రూ.187 కోట్లు కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్లాయి. ఆ సొమ్మును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగించిన రూ.20 కోట్ల నగదు కాంగ్రెస్ కీలక నాయకుడి అనుచరుడిదే అని తేలింది. ఈ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ సత్యనారాయణ వర్మ ప్రధాన నిందితుడు.
తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. అవినీతిని పెంచి పోషించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాంగ్రెస్ అసలు సిసలు నైజం. దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్‌లో నిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. లోతుగా విచారణ జరి పితే తెలంగాణ కాంగ్రెస్‌లోని పెద్ద నాయకుల పేర్లు బయటకు వస్తాయని అన్నారు.
‘నారీ న్యాయ్’కు ఇదేనా నిర్వచనం?
‘సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన లాల్ సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ప్రకటించడం సిగ్గుచేటు. నారీ న్యాయ్ అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ రేపిస్టులను సమర్థించిన వ్యక్తికి సీటును కేటాయించింది. ‘నారీ న్యాయ్’కు కాంగ్రెస్ చెప్పే నిర్వచనం ఇదేనా?’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment