
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు జేజేలు పలుకుతుండటం చూసిన తర్వాత తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లకు సెల్ఫీల పిచ్చి పట్టుకుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ఆమె బుధవారం విశాఖపట్నం జిల్లా డీఆర్‌సీ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో హాజరయ్యారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తండ్రీకొడుకులు సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే రైతుభరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సచివాలయ భవనాల వద్ద తీసుకోవాలని సూచించారు. వారి పిచ్చి టీడీపీ నేతలకు కూడా అంటించారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పాలనపై లేనిపోని విమర్శలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పాలన అందిస్తున్న కారణంగానే ఏం చేయాలో పాలుపోక.. టీడీపీ నేతలు ఇలా తయారయ్యారని ఆమె విమర్శించారు.