సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించలేదని, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి శనివారం పరిశీలించారు.
తర్వాత సర్వజన ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని మంత్రి రజిని విమర్శించారు. టీడీపీ పాలనా కాలంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయండని ఓ టీడీపీ ఎమ్మెల్యే అడిగితే.. రూ.500 కోట్లు అవుతుందని, అంత భారం మోయలేమని చంద్రబాబు తప్పుకున్నారని మంత్రి రజిని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కలిపి దాదాపు 50 వేల మందిని నియమించినట్లు వెల్లడించారు.
త్వరలోనే వైద్య కళాశాలల్లో తరగతులు..
విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల మెడికల్ కాలేజీల్లో సెప్టెంబర్ నెల నుంచి ఎంబీబీఎస్ మొదటి విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి రజిని వెల్లడించారు.
త్వరలోనే ప్రారంభం..
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని, సాలూరు నియోజకవర్గంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వైద్య కళాశాల ప్రారంభమైతే ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment