మమతా బెనర్జీ
కోల్‌కతా: 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అసమర్థ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆకాక్షించారు . అందుకోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ‘బీజేపీ తిరస్కరణ ఎన్నికలు’ కావాలని పిలుపునిచ్చారు
బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వసూలు చేయడంపై ధ్వజమెత్తారు మమత. బీజేపీకి బుర్ర పనిచేయడం లేదని, మరమరాలు, స్వీట్లు, లస్సీ, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ బాదితే ప్రజలు ఏం తినాలని ప్రశ్నించారు. అనారోగ్యంతో ప్రజలు ఆస్పత్రిలో చేరినా దానికి కూడా డీఎస్టీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
కరోనా కారణంగా రెండేళ్ల పాటు అమరవీరుల దినోత్సవాన్ని టీఎంసీ నిర్వహించలేదు. మమత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరుగుతున్నందు వల్ల భారీగా ఏర్పాట్లు చేశారు. సభపైకి ఎల్‌పీజీ సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంధన ధరలు భారీగా పెరిగాయని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మమత. బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ తమ క్యాడర్‌కు శిక్షణ ఇప్పించేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపినుద్దేశించి విమర్శలు గుప్పించారు మమత. 'వాళ్లు ముంబైని విడగొట్టామని భావిస్తున్నారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ను పడగొడతారు. ఆ తర్వాత బెంగాల్ వస్తారు. ఇక్కడికి రావొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది' అన్నారు.
చదవండి: ‘కాషాయం జెండా.. మనదే శివసేన’
Comments
Please login to add a commentAdd a comment