
సాక్షి, హైదరాబాద్: జమిలి ఎన్నికల నిర్వహణపై తన విధానమేంటో బీఆర్‌ఎస్ స్పష్టం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో బీజేపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా జమిలి ఎన్నికలకు తాము అనుకూలమని 2018లో సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, ఇప్పుడు బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న కేసీఆర్ తాజాగా తన పార్టీ వైఖరి ఏంటో వెల్లడించాలని కోరారు.
ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి వస్తుందనే వన్ నేషన్–వన్ ఎలక్షన్ తెరమీదకు తెచ్చారని విమర్శించారు. ఈ విధానానికి ఇండియా కూటమి వ్యతిరేకమని, అందుకే కమిటీ నుంచి అధీర్ రంజన్ చౌదరి వైదొలిగారని చెప్పారు.
ఆ కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతినా?
జమిలి ఎన్నికల బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటులో 2/3 వంతుల మెజారీటీ కావాలని, ఈ విధానంతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి భంగం కలుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకునేందుకే బీజేపీ ఈ కుట్రకు పాల్పడుతోందని, ఈ కుట్ర వెనుక అధ్యక్ష తరహా విధానాన్ని తీసుకు రావాలన్న ఆలోచన బీజేపీకి ఉందని ఆరోపించారు.
అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఆయన బీజేపీకి అనుకూలమని అనుకోవాలా అని ప్రశ్నించారు. దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో పనిచేసిన వ్యక్తిని జమిలి ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా నియమించి ఆ పదవికే కళంకం తెచ్చారని విమర్శించారు.
బోయలకు కేసీఆర్ మోసం.. మేం న్యాయం చేస్తాంః రేవంత్
బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని, అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టు కోలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వాల్మికి బోయలు ఆదివారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిశారు.
తమను ఎస్టీల్లో చేర్చాలని, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ వారికి వినతిపత్రం సమరి్పంచారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ 2014లోనే బోయ వర్గానికి చెందిన భీముడిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. గద్వాల బంగళా రాజకీయాలకు స్వస్తి పలికేలా బోయలు కదలాలని, అవకాశం ఉంటే బోయలకు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీనిచ్చారు.
ఖానాపూర్, కొడంగల్ నుంచి చేరికలు
నియోజకవర్గం బొమ్రాస్‌పేట మండలానికి చెందిన పలువురు నేతలు, ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం, కడెం, ఉట్నూరు, ఇంద్రవెల్లికి చెందిన పలువురు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి గాందీభవన్‌లో కండువాలు కప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు.