ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి త్వరలోనే పెద్ద షాక్ తప్పదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పీఠంపై నుంచి అచ్చెన్నాయుడ్ని తప్పించడానికి నిర్ణయం జరిగిపోయిందని అంటున్నారు. త్వరలోనే అచ్చెన్నాయుడి స్థానంలో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్షుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ మార్పుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా పార్టీ పరంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో హడావిడి చేయడంలో అచ్చెన్నాయుడు ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పై పెచ్చు పార్టీ బలహీనంగా ఉందన్న సంకేతాలను అచ్చెన్నాయుడే లీక్ చేయిస్తున్నారని కూడా పార్టీ అధినేత అనుమానిస్తున్నారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మార్పు జరగడం ఇంచుమించు ఖాయం అంటున్నారు టీడీపీ వర్గీయులు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెంన్నాయుడి వ్యవహార శైలిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోనూ అచ్చెన్నాయుడి వ్యతిరేక వర్గం ఆయన్ను తప్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ వర్గానికి పార్టీలోని సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారని అంటున్నారు.
2020 అక్టోబరులో కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడికి పార్టీ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత ఆయన ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఆయనపై కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడి ఆశీస్సులు ఉండడంతో ఎవరూ అచ్చెన్నాయుడ్ని టచ్ చేయలేకపోయారని అంటారు.
సెప్టెంబరు 9న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే జైలుకు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబును జైలుకు పంపినా ఏపీలో ప్రజల నుండి స్పందన రాలేదు. ఎవరూ ఆందోళనలు చేయలేదు. బాబుతో నేను పేరుతో ఆందోళనలకు పార్టీ శ్రేణులు తరలి రావాలని పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పిలుపునిచ్చినా పార్టీ నేతల నుంచే స్పందన లేదు.
అయితే పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడంలో అచ్చెన్నాయుడు విఫలం కావడం వల్లనే బాబుతో నేను కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పార్టీలో అచ్చెన్నాయుడి వైరి వర్గం ఆరోపిస్తోంది. అచ్చెన్నాయుడ్ని అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తే కానీ పార్టీకి మంచి రోజులు రావని కూడా ఆ వర్గం వాదిస్తోన్నట్లు చెబుతున్నారు. ఆ మధ్య ములాఖత్‌లో భాగంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో భేటీ అయినపుడు పార్టీ భవిష్యత్ పైనే చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
అచ్చెన్నాయుడు సరిగ్గా పట్టించుకోవడం లేదని యనమల కూడా చంద్రబాబుకు ఫిర్యాదుచేసినట్ల సమాచారం. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు అధ్యక్షుడయ్యాక పలు సందర్భాల్లో అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలు రాజకీయ ప్రత్యర్ధులకు లీక్ కావడంపై చర్చించినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్నాయుడు ఓ కార్యకర్తతో పార్టీలేదు బొక్కా లేదు అన్న కామెంట్‌ను అచ్చెన్నాయుడికి తెలీకుండా ఎవరు లీక్ చేస్తారని? యనమల చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు చెబుతున్నారు.
అదే విధంగా లోకేష్ యువగళం యాత్రకు జనాన్ని తరలించకపోవడంపై పార్టీ నేతతో అచ్చెన్నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయ్యింది. లోకేష్ యాత్రకి జనం రాకపోవడంతో పెద్దాయన బాధగా ఉన్నారంటూ అచ్చెంనాయుడు చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో పార్టీ బలహీనతలు వెలుగులోకి వచ్చినట్లయ్యింది.
ఆ తర్వాత మాచర్లలోనూ టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడి చిట్ చాట్ సంభాషణల ఆడియో క్లిపింగ్ కూడా లీక్ అయ్యింది. ప్రతీ సందర్భంలోనూ అచ్చెన్నాయుడు భాగస్వామిగా ఉన్న క్లిపింగ్సే లీక్ కావడం వెనుక కుట్ర ఉందని యనమల అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అనుమానాలనే చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
అన్నింటినీ నిశితంగా పరిశీలించిన తర్వాత అచ్చెన్నాయుడు ఉద్దేశ పూర్వకంగానే పార్టీ పరువు బజారున పడేస్తున్నారని చంద్రబాబు కూడా భావిస్తోన్నట్లు చెబుతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన పార్టీ అధ్యక్షుడే అచేతనంగా వ్యవహరించడం వల్లనే పార్టీ ప్రతిష్ఠ రోజు రోజుకీ మసకబారిపోతోందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు.
దీనిపై యనమలతో పాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత అచ్చెన్నాయుణ్ని తప్పించడమే మేలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి అచ్చెంనాయుడ్ని తప్పిస్తే బీసీ వర్గానికి చెందిన నేతను అవమానించారన్న ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉండడంతో బీసీ వర్గానికే చెందిన యనమల రామకృష్ణుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని చంద్రబాబు భావిస్తోన్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి యనమల రామకృష్ణుడు టీడీపీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆయనే సీనియర్ నాయకుడు పార్టీలో. అందుకు యనమలను అధ్యక్షుణ్ని చేస్తే అవసరమైన వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపిస్తారని చంద్రబాబు భావిస్తోన్నట్లు అంటున్నారు. అయితే తనను తప్పించి యనమలకు పదవిని ఇస్తే.. అచ్చెన్నాయుడు ఊరికే ఉండరని.. యనమలకు నిద్ర లేకుండా చేయడానికి ఏం చేయాలో అంతా చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment