సబ్‌ప్లాన్‌ పేరుతో ఓ బోగస్‌ బిల్లు.. | AP Assembly passesbc sub plan Bill | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్‌ పేరుతో ఓ బోగస్‌ బిల్లు..బీసీలపై మరో వంచన వల!

Published Fri, Feb 8 2019 2:02 AM | Last Updated on Fri, Feb 8 2019 10:53 AM

 AP Assembly passesbc sub plan Bill - Sakshi

సాక్షి, అమరావతి: కీలకమైన బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై కనీస కసరత్తు చేయకుండా టీడీపీ సర్కారు మొక్కుబడిగా గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. బీసీ సబ్‌ప్లాన్‌కు ఎంత కేటాయిస్తారు? ఏ ప్రాతిపదికన? జనాభానా? రిజర్వేషన్లా? అనే కనీస వివరాలు లేవు. అసలు బిల్లులో అంకెలే లేవు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సొంత పార్టీ సభ్యులే సభలో నిలదీయడంతో సర్కారు ఇరుకున పడింది. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత పేరుతో ఓ బోగస్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సొంత ఎమ్మెల్యేలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. బీసీ జనాభా ప్రాతిపదికన ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారా? లేక రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారా? అని టీడీపీ ఎమ్మెల్యేలే సభలో సూటిగా అడగడంతో జవాబు చెప్పలేక బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డొంక తిరుగుడుగా మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వివరాలు లేకుండా దీన్ని సభ్యుల ముందు ఉంచడంపై స్వపక్షం నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సబ్‌ప్లాన్‌కు ఏ ప్రాతిపదికన నిధులు కేటాయిస్తారనే వివరాలు లేవు. ఎంత మొత్తం కేటాయిస్తారో వెల్లడించలేదు. అసలు బిల్లులో ఆ అంకెలు ఎక్కడా లేకపోవడం గమనార్హం. కాసేపు జనాభా దామాషా ప్రకారం అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మరి చట్టంలో ఇదే అంశాన్ని ఎందుకు చేర్చడం లేదని సభ్యులు ప్రశ్నించారు. బడ్జెట్‌లో 50 శాతం నిధులు సబ్‌ప్లాన్‌కు కేటాయించాలని సొంత సభ్యులే పట్టుబట్టడంతో కంగుతిన్న మంత్రి అచ్చెన్న న్యాయ సలహా తీసుకున్న తరువాత బిల్లును ఆమోదిద్దామని పేర్కొనడంతో బీసీ సబ్‌ప్లాన్‌పై చర్చను స్పీకర్‌ అర్థంతరంగా ఆపేయడం గమనార్హం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సర్కారు నిర్వాకాన్ని ఎండగట్టడంతో దిక్కుతోచక బడ్టెట్‌లో 1/3 శాతం కేటాయిస్తామంటూ ఓ కాగితం ముక్కపై రాసి సభలోకి హడావుడిగా పంపి సర్కారు ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడుతూ బీసీల జనాభా 50 శాతం ఉందని, అందుకు తగ్గట్టుగా కేటాయింపులు చేస్తామని గంభీ రంగా ప్రకటించారు. బీసీలపై టీడీపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదనటానికి అంకెలు లేని ఈ బిల్లే ఉదాహరణ అని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

క్లారిటీ లేకుండా బిల్లా? 
స్పష్టత లేకుండా సబ్‌ప్లాన్‌ బిల్లు ఉందని, అసలు అంకెలే లేవని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ.. కూన రవికుమార్‌ ప్రస్తావించిన అంశాలను బలపరిచారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తామని మంత్రి అచ్చెన్న చెప్పడంతో 50 శాతం నిధులు సబ్‌ప్లాన్‌కు కేటాయించాలి, అదే విషయం చట్టంలో చేర్చాలని రవికుమార్‌ మరోసారి పట్టుబట్టారు. ఈ సమయంలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతరులు ఉన్నచోట ఖర్చుపెట్టే విషయంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయంటూ అసమగ్రంగా బిల్లుపెడితే ఎలా అని ప్రశ్నిస్తూ కూన రవికుమార్‌కు మద్దతు పలికారు. బిల్లుపై సరైన క్లారిటీ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మంత్రిని నిలదీశారు. ఇలా ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతుండటంతో స్పీకర్‌ జోక్యం చేసుకుంటూ మీకే సమయం ఇస్తున్నానని తర్వాత చర్చిద్దామని సూచించారు. దీంతో న్యాయశాఖతో చర్చించిన తరువాత బిల్లు ఆమోదం పొందేలా చేద్దామని మంత్రి అచ్చెన్న అనటంతో బీసీ సబ్‌ప్లాన్‌పై చర్చను స్పీకర్‌ అర్ధంతరంగా ఆపేశారు.  
 
మౌనం దాల్చిన మంత్రులు.. 
సభలో ఒకదశలో అధికారపక్ష సభ్యులు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఏం చెప్పాలో తెలియక మంత్రులెవరూ కాసేపు మాట్లాడకుండా మౌనం పాటించడం గమనార్హం. ఎటువంటి విలువ లేని, అసమగ్రమైన బీసీ సబ్‌ప్లాన్‌ను సభలో ప్రవేశపెట్టారనే విషయం ప్రజల్లోకి వెళ్తోందని గ్రహించిన స్పీకర్‌ చర్చను అర్థంతరంగా ఆపేశారు. ఆ తరువాత అరగంటపాటు కాపు రిజర్వేషన్, ఈబీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. మిగిలిన ఐదు శాతం ఈబీసీలకు ఇస్తున్నట్లు మరో బిల్లును శాసనసభ ఆమోదించింది.  
 
రెండు వర్గాలుగా వర్గీకరిస్తూ బిల్లులు ఆమోదం 
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన కులాలకు (ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు  కల్పిస్తూ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దీన్ని రెండు వర్గాలుగా విభజిస్తూ కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లును గురువారం శాసన సభ ఆమోదించింది. అలాగే ఈబీసీల్లో మిగతా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మరో బిల్లును శాసన సభ ఆమోదించింది. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని చేసిన ఈ చట్టం ఎలా చెల్లుబాటు అవుతుందని అధికార వర్గాలే ప్రశ్నించడం గమనార్హం. 
  
జవాబు చెప్పలేక తడబడ్డ మంత్రి
ఎన్నికల ముందు బీసీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సర్కారు ఎటువంటి వివరాలు లేకుండా ప్రధానంగా బడ్జెట్‌లో ఎంత శాతం మేర సబ్‌ ప్లాన్‌కు కేటాయిస్తారనేది చెప్పకుండా బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అబాసుపాలైంది. ఈ బిల్లుపై స్వపక్ష సభ్యులే పలు సందేహాలను వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక సబ్‌ప్లాన్‌పై చర్చను ముగించింది. వివరాలేమీ లేకుండా బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసన సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టగానే ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ చర్చలో పాల్గొంటూ బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లులో ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టత లేదన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 65 శాతం ఉన్నారని, రిజర్వేషన్‌ 27 శాతం ఉందని మరి సబ్‌ప్లాన్‌ నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నారా? లేక రిజర్వేషన్‌ ప్రాతిపదికన కేటాయిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత లేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపు ఎంత? ఎలా కేటాయిస్తారు? అంటూ రవికుమార్‌ నిలదీయడంతో అచ్చెన్నాయుడు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తూ ‘మావాడికి తెలివితేటలు ఎక్కువయ్యాయి..’ అంటూ వ్యాఖ్యానించారు. 

కొసమెరుపు
కాపులు, ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదిస్తున్నట్లు సభలో స్పీకర్‌ ప్రకటించిన సమయంలో అచ్చెన్నాయుడు చేతిలోకి ఓ కాగితం వచ్చింది. ఆ కాగితంలో ఉన్న వివరాలను చదువుతూ రాష్ట్ర బడ్జెట్‌లో1/3వ వంతు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లును కూడా ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించడం కొసమెరుపు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement