సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలను ఆత్మబంధువులా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకగలుగుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా శనివారం భీమిలి నియోజకవర్గం తగరపువలసలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు దళితులకు ఏ మేలూ చేయలేదని చెప్పారు.
పైగా, అన్ని వర్గాలను మోసం చేశారని, మహిళలపై దాడులు చేయించారని, అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బతుకులు బాగు చేశారని తెలిపారు. బడుగులకు రాజ్యాధికారం రావాలన్న అంబేడ్కర్ కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు. మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు.
పేదవాడికి మంచి వైద్యాన్ని, మంచి విద్యను అందిస్తున్నారని, మంచి గూడు ఉండాలన్న ఆలోచనతో ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 650కు పైగా వాగ్దానాలు ఇచ్చాయని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. వారంతా కలిసి మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు.
ఇంత మంచి ఎప్పుడూ జరగలేదు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న మంచి గతంలో ఎప్పుడూ జరగలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదవాలని సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందు చూపుతో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టారని, ఇది ఇష్టంలేని దత్త పుత్రుడు పవన్ వ్యతిరేకంగా మాట్లాడటం మన దౌర్భాగ్యమని చెప్పారు.
ఇటీవల తాను యూఎస్‌లో ఒక సమావేశానికి వెళితే.. ఓ యువకుడు వచ్చి అతని తండ్రి రిక్షా తొక్కే వాడని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఉన్నత చదువులు చదివానని, ఇప్పుడు సాప్‌్టవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ఆనందంతో చెప్పాడన్నారు. ప్రస్తుత సీఎం జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరింత మందికి అందించడమే కాకుండా, విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమని కొనియాడారని తెలిపారు.
వైఎస్సార్‌సీపీకి ఓటు వేయనప్పటికీ, జగనన్న సంక్షేమ పథకాల రూపంలో రెండున్నర లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేశాడని ఓ మహిళ ఇటీవల తనతో చెప్పారన్నారు. ఇలా.. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కుల, మత, పార్టీ రహితంగా ఎంతో మంది పేదలు లబి్ధపొందారన్నారు. సీఎం జగన్ బీసీలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే మొదటిగా అభివృద్ధి జరిగేది భీమిలి నియోజకవర్గమని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక మెజారిటీ ఇచ్చి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, మాజీ మంత్రి బాలరాజు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర తదితరులు
పాల్గొన్నారు.
‘దొరికిన దొంగ’ చంద్రబాబు: మంత్రి సీదిరి అప్పలరాజు
పేదలకు మేలు జరగడం ఇష్టం లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు అచ్చేయడం కాదని, ఈరోజు భీమిలిలో జరిగిన సామాజిక న్యాయాన్ని చూడాలని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. వారు రాస్తున్నట్లు తుస్సుమనే యాత్ర కావాలంటే నారా భువనేశ్వరి యాత్ర చూడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా మత్స్యకారులమంతా వెళితే.. తాట తీస్తా.. తోలు తీస్తా అంటూ అవమానించారన్నారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని అవమానించారు. ఇలా అన్ని వర్గాలను అవమానించిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడని, ఆయనో ‘దొరికిన దొంగ‘ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ సోదరుడు చంద్రబాబు చేసిన అవమానాలను గుర్తుంచుకుని వచ్చే ఎన్నికల్లో సీఎంగా మరోసారి జగనన్నను ఆశీర్వదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment