
సాక్షి, అమరావతి: పోలీసులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం మరోసారి బయటపడింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని వైఎస్సార్‌సీపీకి ముడిపెట్టి రాద్ధాంతం చేయడం, ఏపీ డీజీపీ సవాంగ్‌కు లేఖలు రాసి అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకోవడం వంటివి తెలిసిందే. తాజాగా విశాఖలో జరిగిన ఓ ఘటనకు అవాస్తవాలు జోడించి వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నం చేసిన చంద్రబాబుకు చివరకు భంగపాటు ఎదురైంది. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ విశాఖపట్నంలోని పలు నియోజకవర్గాల్లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ట్వీట్
ఈ సందర్భంగా కిందపడిన అరిలోవ సీఐ ఇమ్మానియేల్‌రాజును వైఎస్సార్‌సీపీ శ్రేణులు పైకి లేపి సపర్యలు చేశారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను చూపి, వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితులను చూసి షాకింగ్ అయ్యేలా ఈ చిత్రం ఉంది. వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నందుకు పోలీసులపై వైఎస్సార్‌సీపీ గూండాలు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు కూడా రక్షణ లేదు’ అంటూ ఆ ట్వీట్‌లో విమర్శలు చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎల్లోమీడియా అవాస్తవ ట్వీట్‌ను రక్తికట్టించే ప్రయత్నం చేసింది.
విశాఖలో జరిగిన ఘటనపై ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఏపీ పోలీస్ శాఖ ఆరా తీసింది. చంద్రబాబు ట్వీట్ అవాస్తవమనే విషయాన్ని వాస్తవ ఫొటోలతో సహా ఏపీ పోలీస్ శాఖ ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్వీట్టర్ ఖాతా’లో ట్వీట్‌లు చేసింది. ‘ప్రతిపక్ష పార్టీ గౌరవనీయ నాయకుడు ఎన్‌సీబీఎన్ సార్ మీ పోస్ట్ సరైనది కాదు. మీరు చేసిన ఆరోపణలు మళ్లీ తప్పు. పోలీస్ ఆఫీసర్‌కు వైఎస్సార్‌సీపీ కేడర్ సహాయం చేయడం, అతని గాయానికి మసాజ్ చేయడం మాత్రమే జరిగింది. దయచేసి అవాస్తవ ప్రకటనలకు దూరంగా ఉండాలి. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకూడదని అభ్యర్థిస్తున్నాము. మీరు చేసినది అనవసరంగా పౌరులను తప్పుదారి పట్టిస్తుంది. పోలీసులను కూడా నిరుత్సాహపరుస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను నిర్వహించడానికి పోలీసులతో దయతో సహకరించమని అభ్యర్థిస్తున్నాం’ అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment