కనీస సంస్కారం , మనావత్వం లేకుండా నోటికొచ్చిందే వాగుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై తెలుగుదేశం, జనసేన పార్టీల వ్యాఖ్యలు చూస్తుంటే, వారి కూతలు వింటుంటే వాళ్లలో రాక్షసత్వం ఎంతగా పేరుకుపోయిందో అర్ధం అవుతోంది. వాళ్లసలు మనుషులే కారన్న కఠోర వాస్తవం బోధ పడుతుంది. వాళ్లు కూడా మిగతా మనుషులతో కలిసి సమాజంలో తిరుగుతోంటే భయమేస్తుంది. ఏ మాత్రం బాధ్యత లేని వారి తెంపరి తనాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ కీచకులకు వంతపాడే పండుముదుసలి రామోజీ పత్రిక పైత్యం చూసి ఒళ్లు మండుతోంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను తుదముట్టించడమే లక్ష్యంగా కిరాయి హంతకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వెను వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచం. ఘోరాతి ఘోరం. ఈ దాడిని జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని అచ్చెన్న కూస్తే.. లోకేష్ వాగుడు మరీ బాధ్యతారాహిత్యం. ఆ రాళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయట.
లోకేష్ ఇలా కూయడానికి కారణాలు ఉన్నాయి. తన తాత అని లోకేష్ పదే పదే చెప్పుకునే నందమూరి తారకరామారావుపై తన తండ్రి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటట్‌పై నుంచి చెప్పులు వేయించిన ఘటన లోకేష్ గుండెల్లో పదిలంగా ఉన్నట్లుంది. అందరూ తన నాన్నలాగే కౄరంగానే ఆలోచన చేస్తారని లోకేష్ అనుకుంటూ ఉండచ్చు. లేకపోతే ఇటువంటి పిచ్చి కూతలు రావడం సాధ్యం కాదు.
ఇక జనసేన నాయకుడు సినీ నటుడు కొణిదెల నాగబాబు మరో అడుగు ముందుకేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..ఎక్కడా స్క్రిప్టెడ్ అనిపంచనే లేదు అంటూ వెకిలి కామెంట్ ను ట్వీట్ చేశారు నాగబాబు. నటుల వంశం కాబట్టి వెండితెరపై అంతగా నటించలేకపోయినా.. రాజకీయ తెరపై నటనలో ఇరగదీసేస్తున్నారు నాగబాబు. తాను పెట్టిన ట్వీట్‌ను చూసిన తన సర్కిల్‌లోని వారే తిట్టారో.. మరీ అసహ్యంగా ఉందన్నారో తెలీదు కానీ తాను మొదట పెట్టిన ట్వీట్‌ను తీసేసి కొత్తగా మరో ట్వీట్ పెట్టారు.
ఈ సారి తెచ్చిపెట్టుకున్న సంస్కారాన్ని నటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు మంచివి కావంటూ సింగిల్ టేక్‌లో డైలాగ్ కట్ చేశారు.నాగబాబు మొదట పెట్టిన ట్వీట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కారం ఉన్న వారంతా ఛీఛీ అన్నారు. సినీ రంగంలోని ప్రముఖులు అయితే మరీ ఇంత చీప్‌గా అనడం ఏంటని ఆశ్చర్యపోయారు.
నిజానికి నాగబాబు కమెడియన్‌కు ఎక్కువ. తమ్ముడు పవన్‌కు తక్కువ అని సినీ జనాలు అంటూ ఉంటారు. ఆయ నెంచి సంస్కారాన్ని ఆశించవద్దని వారంటారు. అయినా వాలంటీర్లు మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఒళ్లు కొవ్వెక్కి దారుణపు కూత కూసిన పవన్ కల్యాణ్‌కు అన్న నాగబాబు.. కాబట్టి ఆయనుంచి సంస్కారాన్ని ఆశించలేం అంటున్నారు పాలక పక్ష నేతలు.
చదవండి: ‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిందెవరో తేలాలి. వారి వెనుక ఉన్న శక్తులేంటో తెలియాలి. కచ్చితంగా ఇది హత్యాయత్నమే అనడంలో సందేహం లేదు. హత్యాయత్నం జరిగితే దాడి చేసిన వారు విలన్లు .చేయించిన వారు సూత్రధారులు అవుతారు. కానీ రామోజీ పత్రిక మాత్రం దాడి చేసిన వారిని వదిలేసి భద్రతా వైఫల్యాలు ఉన్నాయంటూ వెర్రి కథనం ఒకటి వండి వార్చింది.
మనుషులకు చెట్ల మాదిరిగానే ఏళ్ల వయసు వచ్చి పడుతుంది కానీ..వయసు పెరిగినంత మాత్రాన సంస్కారం, మానవత్వం పెరగవని చాటి చెప్పడానికి రామోజీ, చంద్రబాబులను మించిన సాక్ష్యాలు అవసరం లేదంటారు మేథావులు. హత్యాయత్నానికి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్‌ను రాళ్లతో కొట్టాలని ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా పిలుపు నిచ్చారు.
విన్నారుగా. చంద్రబాబు ఎందుకిలా అన్నారో తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. తాను చేపట్టిన ప్రజాగళం సభకు జనం రారు. సీఎం సభకు ప్రజలకు ఇళ్లల్లో పనేమీ లేనట్లు సునామీలా తరలి వస్తారు.ఆ తేడా చూస్తూ బాధ వేయదాండీ? దాడి చంద్రబాబు నాయుడో టీడీపీ వారో చేయించారని ముందుగానే ఎవరూ అనడం లేదు. కాకపోతే దాడి జరిగిన వెంటనే టీడీపీజనసేన ఎల్లో మీడియాల ఓవర్ యాక్షన్ చూస్తే మాత్రం కచ్చితంగా ఇది వారి పనే అని ఎవ్వరికైనా అనిపించక మానదు.
సరే హత్యాయత్నానికి ఎవరు ప్లాన్ చేశారు. ఎవరు కిరాయి హంతకులను పంపారు అన్నవి దర్యాప్తులో తేలతాయి. అవి పక్కన పెడదాం. పాలక పక్ష నాయకుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగినపుడు ప్రతిపక్ష నాయకులు ఖండించాలనుకుంటే ఖండించవచ్చు. లేదంటే మౌనంగా ఉండచ్చు. కానీ టడీపీ, జనసేనలు ఎంతగా దిగజారిపోయాయంటే ఈ దాడి జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని సిగ్గుమాలిన దిక్కుమాలిన కూతలు కూశాయి.
దశాబ్ధాల క్రితం ఎల్లో మీడియా కానీ టీడీపీ కానీ ఇంత బరితెగింపు వ్యాఖ్యలు చేయలేదు. హత్యలు చేయిస్తే చేయించి ఉండచ్చు కానీ వాటిపై జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడేవారు. అదే వంగవీటి రంగా దారుణ హత్య ఇపుడు జరిగి ఉంటే ఇదే టీడీపీనేతలు రంగాయే తనపై దాడి చేయించుకుని ఫేమస్ అయిపోదామనుకున్నారని అని ఉండేవారు.
మీడియాలో పైకి ఎదిగిపోవాలన్న దుర్బుద్ధితోనే పింగళి దశరథరామ్ తానే మనుషులను పురమాయించుకుని తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని.. అది వికటించి ఆయన మరణించారని అని ఉండేవారు. రామోజీ పత్రిక అయితే రంగా, దశరథరామ్ హత్యల విషయంలో భద్రతా లోపాలు ఎక్కడున్నాయో భూతద్దం పెట్టి వెతికేది. ఇవన్నీ చూస్తోంటే ఓ అనుమానం కూడా వేయక మనదు.
2003లో చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన దాడి బహుశా చంద్రబాబే ప్లాన్ చేయించుకుని ఉంటారు. అందుకే ఆ దాడి జరిగిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వాజ్ పేయ్ఒను ప్పించి డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను మే నెలకి తీసుకు వచ్చారు. అని రాజకీయ పరిశీలకులు ఇపుడు అనుమానిస్తున్నారు.పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. పచ్చపార్టీ నేతలకూ అంతే. తాము చేసే ప్రతీ వెధవపనినీ తమ ప్రత్యర్ధులు కూడా చేస్తారని పసుపు పార్టీ నేతల ఎరుపు ఐడియా.
సీఎం జగన్‌ను హత్యాయత్నాలతోనూ దాడులతోనూ ఎవరూ బెదిరించలేరు. ఆ విషయం 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడిన ఘటనే నిరూపించింది. అపుడు కూడా ఆయన దాడి జరిగింది కదా అని ,నెత్తురు కారింది కదా అని భయపడలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈసారి టీడీపీకి ఆ 23 స్థానాలు కూడా రానే రావంటున్నారు రాజకీయ పండితులు.
సీఎన్‌ఎస్. యాజులు, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment