కౌశిక్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలవి చిల్లర వ్యవహారాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, చిక్కుడు, మేడిపల్లి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు హరీశ్‌రావు చేస్తున్న నీచ రాజకీయాలతో ఖతం అవుతుందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు.. కౌశిక్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న చిల్లర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్‌పీ కార్యాలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో తన సోదరి కవితకు బెయిల్ రాగానే కేటీఆర్ అమెరికాకు చెక్కేశారని, ఇక్కడ వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ఏమాత్రం సోయి లేకుండా అమెరికాలో ఎంజాయ్ చేయడానికి వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబం చేసిన క్షుద్ర ఆలోచనలతో ఎంతో మంది యువకులు బలి అయ్యారన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఉన్మాదిలా తయారయ్యారని అన్నారు. మహిళల ఆత్మగౌరావన్ని దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వైఖరి ఉందని విమర్శించారు. ఆ పారీ్టలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే కౌశిక్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరికెçపూడి గాంధీ బీఆర్‌ఎస్ సభ్యుడే అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన అంతా కమీషన్ల కోసమే సాగిందని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో కేసీఆర్ కుటుంబం ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేక రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. కౌశిక్‌రెడ్డివి పిల్ల చేష్టలని, ఆయన బీఆర్‌ఎస్ పార్టీ పరువు తీస్తుంటే హరీశ్‌రావు ప్రోత్సహిస్తున్నట్లు ఉందని అన్నారు. గతంలో గవర్నర్ తమిళిసై మీద ఇష్టానుసారంగా మాట్లాడి కౌశిక్‌రెడ్డి మహిళలను అగౌరవపర్చాడన్నారు. కౌశిక్‌రెడ్డి తన ప్రవర్తన మార్చుకోకపోతే బడిత పూజ ఖాయమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment