పూర్తిగా చంద్రముఖిలా మారిన చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Meeting With Anantapur YSRCP Party Leaders, Watch Details Video Inside | Sakshi
Sakshi News home page

పూర్తిగా చంద్రముఖిలా మారిన చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌

Published Thu, Dec 19 2024 9:07 AM | Last Updated on Thu, Dec 19 2024 1:55 PM

YS jagan Key Meeting With Anantapur YSRCP Party Leaders

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ మాట్లాడుతూ.. ‘ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ, చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేశాం.

చరిత్రలో వైఎస్సార్‌సీపీ ఒక్కటే..
కోవిడ్‌ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించాం. క్యాలెండర్‌ ప్రకారం ప్రతీ పథకాన్ని అమలు చేశాం. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్‌ చేశాడు కదా.. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. జగన్‌ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందీ. ఉన్న పథకాలు పోయాయి.. ఇస్తానన్న పథకాలు రావడంలేదు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు మొదలైంది. ఆరు నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశాడు.

అంతా మాఫియానే.. 
రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయి. శాండ్ మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్‌ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతీ ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత అనే కార్యక్రమం నడుస్తోంది. మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని అంతా చైతన్యం చేస్తున్నాం. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.

రైతులు ఆగం..
రైతులకు మనం ఏడాదికి ఇచ్చే రూ.13,500 ఎగిరిపోయింది.. చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్‌టీవో ఇచ్చే వాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజు రియింబర్స్‌మెంట్‌, వసతి దీవెనమీద నిరసనలకు ప్లాన్‌ చేశాం.

మన ప్రభుత్వ హయాంలో ప్రతీ త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది:

కష్టం ఎల్ల కాలం ఉండదు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు కూడా పెడతారు, జైల్లో కూడా పెడతారు. ప్రతీ కష్టానికి ఫలితం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. నావైపు చూడండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. నా భార్య బెయిల్‌ పిటిషన్‌ కనీసంగా 20 సార్లు పెట్టి ఉంటుంది. కింద కాంగ్రెస్‌, పైన కాంగ్రెస్‌. ఎన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా?. ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఢీకొనేలా ఉందాం. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుంది.

సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు. రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుంది.

విజన్‌ పేరిట మరో డ్రామా..
విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా వారి మేనిఫెస్టోపై ఊదరగొట్టారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది?. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్‌ అని నేను నమ్ముతాను. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై మనం ఆలోచనలు చేస్తే అది విజన్‌ అవుతుంది. అలాంటి ఆలోచనలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. ప్రైవేటు స్కూల్స్‌.. గవర్నమెంటు స్కూల్స్‌తో పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం. ఉన్నత విద్యలో విద్యార్థులు అత్యాధునిక కోర్సులు చదువుకునేలా ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పించాం.

విజన్‌ మనది.. 
ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. 
ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. 
ప్రివెంటివ్‌ కేర్‌ విషయంలో అనేక చర్యలు తీసుకున్నాం. 
ఆర్బీకే వ్యవస్థ ఒక విజన్‌. ప్రతీ ఎకరాకు ఈ-క్రాప్‌ చేయడం విజన్‌. 
ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా తీసుకురావడం ఒక విజన్‌.
రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయడం ఒక విజన్‌. 
ఈ మార్పులన్నీ వచ్చింది వైయస్సార్‌సీపీ హయాంలోనే..

మన ప్రభుత్వం రాక ముందు ఒక రూపాయి ప్రజలకు ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేదా?. హయంలో ఎక్కడా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చగలిగాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించి గొప్ప విజన్‌ను తీసకురాగలిగాం. కానీ, రంగ రంగుల కథలు చెప్తున్నారు. దానికి విజన్‌ అని పేరుపెడుతున్నారు. దాన్ని విజన్‌ చేయడం అనరు.. దగా చేయడం అంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్‌ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి అని సూచనలు చేశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement