57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే.. నా కోసం రెండు బటన్‌లు నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. రెండోది పార్లమెంట్ ఎన్నికల కోసం. లేకుంటే.. గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ‘‘లక లక’’ అంటూ ప్రతీ ఇంటింటికి వస్తుంది. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024 ఎన్నికల్లో జగనన్నకు ఓటేస్తే.. ఆ చంద్రముఖి బెడద ఇక మీకు శాశ్వతంగా ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు.
చంద్రబాబును చంద్రముఖితో పోలుస్తూ దెందులూరు సిద్ధం సభలో ప్రసంగించిన సీఎం జగన్
‘‘14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చెప్పుకొనేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశా నాకు ఓటేయండి అని అడగాల్సిన వ్యక్తి.. చెప్పుకొనేందుకు ఏదీ లేదు కాబట్టి పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో సాగుతోంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీరామారావు గుర్తుకొస్తున్నారు. వెన్నుపోటు పొడిచేదీ ఆయనే, మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ను గుర్తు తెచ్చుకొనేదీ ఆయనే. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటున్నారు. ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తున్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు.
నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు, కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని వాళ్ల వదినమ్మను పిలుస్తున్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైయస్సార్ గారి మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా చార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నువ్వు కూడా రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. ఈస్టేట్ కు, వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే, ఆ ప్రజలతో పని పడినప్పుడే. ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే కనీసం 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేసుకొనేందుకు అభ్యర్థులు కూడా లేరు.
ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్ గా, పేద వాడి సంక్షేమం టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.వీరితో యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ యుద్ధం.. 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే.
ఇదీ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ కనిపిస్తున్న జెండాకు అర్థం.. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా.
వంద బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా. పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్త, నాయకుడికీ, అభిమానికీ, ప్రతి వాలంటీర్ కి, ఒక్క విషయం చెబుతున్నా, వీరితోపాటు ప్రజా ప్రతినిధులకు ఒక్కటే చెబుతున్నా. ఇది.. మీ అందరి పార్టీ. మీ జగన్ మీ బిడ్డ. మీ అందరికీ ఒక మంచి సేవకుడు. కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం ఇవన్నీ కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.
గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకొచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన పార్టీకి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతూ మనతోపాటు పని చేస్తున్నారు. ఎవరూ గెలవనన్ని పదవులు, ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
మంచి పాలన అందించాం. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా గొప్ప పాలన ఇవ్వగలం అని చూపించాం. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. ఇక్కడున్న ఎవరైనా ఏ పదవికైనా పోటీ చేయగలిగితే ఎప్పుడూ చూడని విధంగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్ లో ఇంతకంటే గొప్పగా మన వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ. వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాదీ అని తెలియజేస్తున్నా.
వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. 25 ఎంపీలకు 25 ఎంపీలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీలే లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకొనేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?. సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా సిద్ధమేనా..?. సమర భేరి ఖల్లుమంది. ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉన్నారా? అని అందరినీ అడుగుతున్నా.
మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ముడు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి. సిద్ధమా.. అని అడుగుతున్నా. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నా.. అని సీఎం జగన్ దెందులూరు సిద్ధం సభలో ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment