సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ కీలక నేతలు అన్నారు. మంగళవారం జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర తదనంతర బహిరంగ సభలో వివిధ వర్గాలకు సీఎం జగన్ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని జనాలకు వాళ్లు తెలియజేశారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో ఈ సభ జరిగింది.
‘‘గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు. దళితుల్ని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. కానీ, వెనుకబడిన వర్గాలను జగన్ గుండెల్లో పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసిన నాయకుడు జగన్. కేబినెట్‌లో.. నామినేటెడ్ పోస్టుల భర్తీల్లోనూ వెనుకబడిన వర్గాల వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమం అందించాం. కుల, మత.. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా సంక్షేమ పథకాలు అందించాం.
.. సీఎం జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రూ.2.67 లక్షల కోట్లను నేరుగా లబ్ధి దారుల ఖాతాలో జమ చేశాం. ఇచ్చిన హామీలు సీఎం జగన్ నెరవేర్చారు. కానీ, ప్రభుత్వంపై టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం. ప్రజలు సీఎం జగన్‌నే మళ్లీ కోరుకుంటున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘‘రూ. 1,900 కోట్లతో చోడవరం నియోజక వర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రూ. 80 కోట్ల రూపాయలతో నియోజక వర్గంలో రోడ్లను ఏర్పాటు చేశాం. విద్యా రంగంలో నాడు నేడు కోసం రూ.87 కోట్లు ఖర్చు చేశాం. జనసేన-టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోలేరు. జయహో జగన్.. అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వడమే దీనికి నిదర్శనం.
ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సభకు వచ్చిన జనాలను చూస్తే వార్ వన్ సైడ్ అవుతుందనిపిస్తోంది. కులాలు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. సీఎం జగన్.. సుదీర్ఘ కాలం పాదయాత్ర ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. జిల్లాకు ఒక మెడికల్ ఏర్పాటు చేశారు. కాబట్టి.. 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుంది.
ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు,బలహీన వర్గాల్ని అవమానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?. రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువల్లే టీడీపిని ప్రజలు పక్కన పెట్టారు. ఆకలి తీర్చే నాయకుడు కావాలో-మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి.
టీడీపీకి జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ అవసరం అయినప్పుడు తన పార్టీని తాకట్టు పెడుతున్నారు. తెలంగాణలో పవన్‌కు డిపాజిట్లు రాలేదు. బర్రెలక్కకు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్,చంద్రబాబు,లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదు వీళ్లకు. సీఎం జగన్ ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారు.
మంత్రి కారుమురి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ హయాంలో రూ.400 కోట్లు కూడా చోడవరం కోసం ఖర్చు చేయలేదు. అదే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,900 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు ఇవ్వాలని ఆదేశించారు. అదే సీఎం జగన్ .. అర్హులైన వాళ్లందరికీ పథకాలు వర్తింపజేయాలని చెప్పారు. ఇచ్చిన ప్రతీ హామీనే కాదు.. ఇవ్వని మరికొన్ని హామీల్ని కూడా సీఎం జగన్ అమలు చేశారు. విద్యా విప్లవం తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దే.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో వ్యవసాయం తిరోగామిలోకి వెళ్లింది. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో మాత్రం అభివృద్ధి పెరిగింది. ఆ టైంలో జీడీపీ 16వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు. పేదల ఖాతాల్లో 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత సీఎం జగన్దే. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన ఏపీలో సాగుతోంది. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు. నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూలా మార్పులు తెచ్చారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అవుతుంది. అన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment