ప్రకాశం: మండలంలోని పొట్లపాడు గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు చేశారు. మంగళవారం రాత్రి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు.
ఒక ట్రాక్టర్ ట్రక్కులో గణపతి విగ్రహాన్ని ఉంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు వైపులా ఇనుప పైపులు ఉంచి డెకరేషన్ చేశారు. గ్రామోత్సవం అనంతరం పొలాల్లోని నీటి గుంటల్లో నిమజ్జనం చేసేందుకు పొలాల బాటలో వెళుతుండగా విద్యుత్ తీగలు డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురవడంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా కిందకు దిగారు. ప్రమాదంలో చమిడిశెట్టి శ్రీను(35), తడకమల్ల నాగేంద్రం (11) విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పడంతో వెంటనే వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
మృతుడు శ్రీనుకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. నాగేంద్రం 8వ తరగతి చదువుతున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యం దేవకుమార్ తెలిపారు.
అన్ని విధాలా అండగా ఉంటాం
పొట్లపాడులో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. పార్టీలో చురుకై న పాత్రను శ్రీను పోషించాడని, ఒక కార్యకర్తను పోగొట్టుకోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉండి శ్రీను లేని లోటును తీర్చుతానని హామీ ఇచ్చారు.
ఆయన వెంట రాష్ట్ర గ్రీనరి అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్.సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కండె గంగయ్య, దర్శి ఏఎంసీ మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కాకర్ల కాశయ్య, నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment