లక్ష మందికి గోకులం షెడ్లు నిర్మించాలి
● ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్
టంగుటూరు: గొర్రెలు, మేకల పెంపకందారులు, సభ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి షెడ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం టంగుటూరు మండలం శివపురం, టంగుటూరు గ్రామాల్లో పెంపకందారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గొర్రెలు, మేకల వృత్తిపై ఆధారపడి ఐదు లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. కానీ, ప్రభుత్వం నామమాత్రంగా ఊరికి ఒకటి చొప్పున షెడ్డు నిర్మిస్తోందన్నారు. ఒక ఊరులో 20 నుంచి వంద మంది వరకు పెంపకందారులు ఉంటారని, వారందరికీ విడతల వారీగా షెడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 20 వేల మంది గొర్రెలు, మేకల పెంపకందారులు ఉండగా, కేవలం వందల్లో మాత్రమే ఇచ్చారని, దీంతో మిగతా పెంపకందారులు నిరాశ చెందుతున్నారని తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, ప్రత్యేకంగా షెడ్లు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్లు, వివిధ రకాల జబ్బులు, ప్రకృతి వైపరీత్యాలు జరగడం వలన వందలాది జీవాలు చనిపోయి పెంపకందారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పశు నష్ట పరిహార పథకం ద్వారా పరిహారం ఇచ్చేదని, దానిని మధ్యలో నిలుపుదల చేసిందని, దీంతో పెద్ద ఎత్తున పెంపకందారులకు జీవనోపాధి కోల్పోయి తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. ఈ పథకాన్ని వెంటనే పునరుద్ధరించి అన్ని జీవాలకు ప్రభుత్వమే ఉచితంగా బీమా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు, ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షుడు బుర్రా శ్రీరాములు, డి.రమణయ్య సభ్యులు బుర్ర వెంకట్రావు, చావలి వెంకటేశ్వర్లు, కొండ చినజాలయ్య, చావలి శ్రీనివాసులు, కటారి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment