ఒంగోలు సబర్బన్: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం సర్వర్లు మొరాయించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆస్థి విలువలు పెంచుతుండటంతో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. ఆదాయమే పరమావధిగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. స్థిరాస్థి విలువలను 40 నుంచి 50 శాతం వరకు పెంచుతోంది. ఇప్పటికే ఉన్న స్థిరాస్థి విలువలను అమాంతం పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వ తీరును గమనించిన స్థిరాస్థుల క్రయవిక్రయదారులు జనవరి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేయించుకుందామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఎగబడ్డారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్లు మొండికేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 12 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నెమ్మదించిన సర్వర్లు.. ఆరు గంటల నుంచి కొంచెం సహకరించటం ప్రారంభించాయి. దాంతో రాత్రి పొద్దుపోయేంత వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో రోజువారీగా 300 నుంచి 400 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అలాంటిది గురువారం ఒక్కరోజే దాదాపు రెండింతలుగా డాక్యుమెంట్లు వచ్చిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో సర్వర్లు మొరాయించాయి. క్రయవిక్రయదారులు నానా అవస్థలు పడ్డారు. నేడు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు ముందే చేయించుకునేందుకు ఒక్కసారిగా ఎగబడిన ప్రజలు జిల్లా వ్యాప్తంగా సర్వర్లు మొరాయించి నిలిచిన రిజిస్ట్రేషన్లు
Comments
Please login to add a commentAdd a comment