![ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/adimulapu-suresh_mr-1738264907-0.jpg.webp?itok=KPch4mLz)
ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..
● మాజీ మంత్రి
డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని, అంతేతప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సింగరాయకొండలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ మారడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కొందరు పనిగట్టుకుని తనను అప్రతిష్ట పాలు చేసేందుకే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎవరికో ప్రచారం కోసం, ఎవరికో లబ్ధి కోసం తనపై బురదజల్లుతున్నారని, బట్టకాల్చి మొహంపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని, తాను దళితుడిని అయినప్పటికీ తన వెన్నంటి ఉండి ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. నాయకత్వానికి, దార్శనికతకు పెట్టింది పేరు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, రాజకీయాల్లో విలువలు ఉన్న నాయకుడని కొనియాడారు. జగన్ అంటే ఒక ధైర్యమని అన్నారు. ఎనిమిది నెలలకే నయవంచన చేసినట్లు గుర్తించి కూటమి పార్టీలను ప్రజలు అసహ్యించుకుంటుంటే తాను ఎందుకు పార్టీ మారతానంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీలో అలజడి సృష్టించడమే పనిగా కొందరు పెట్టుకున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి గొప్ప వ్యక్తి అని, వైఎస్సార్ సీపీకి ఆయన అందించిన సేవలు గొప్పవని అన్నారు. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తామన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తే విజయసాయిరెడ్డి రాజీనామా వైఎస్సార్ సీపీ అంతర్గత వ్యవహారమని అంటే.. హోం మంత్రి అనిత మాత్రం నోరు పారేసుకోవటం ఆమె సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. జగన్‌కు ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయని వివరించారు. 2016లోనూ తనపై అసత్య ప్రచారం చేశారని, కానీ, పార్టీ మారలేదని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని సురేష్ అన్నారు.
నేడు ఉపాధ్యాయుల వివరాల్లో మార్పులు చేసుకోవాలి
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, నగరపాలక సంస్థ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా పాఠశాల విద్యాశాఖ గౌరవ సంచాలకుల ఆదేశాల మేరకు వారి వివరాలను వ్యక్తిగత టీఐఎస్ (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం) లాగిన్‌లో మార్పులు ఉంటే చేసుకోవాలని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం ఈ నెల 31వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఉపాధ్యాయులంతా టీఐఎస్ లాగిన్‌లో సరిచూసుకుని ఏదైనా మార్పులుంటే సరిచేసుకోవాలన్నారు. వివరాలు పూర్తిగా నింపకుండా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా అన్ని వివరాలు నింపి సబ్మిట్ చేయాలని, వీటి ఆధారంగానే పదోన్నతులు, బదిలీలు ఉంటాయని డీఈఓ తెలిపారు.
రేపు సామాజిక పెన్షన్ల పంపిణీ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని 2,84,637 మంది లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లను ఫిబ్రవరి 1వ తేదీ పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.123 కోట్ల 31 లక్షల 58 వేలను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా పాల్గొని లబ్ధి దారులకు ఇంటి వద్దనే ఉదయం 5 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. అదే రోజు సాయంత్రానికి 99 శాతానికిపైగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఐవీఆర్‌సీ పద్ధతిలో ఎవరైనా పెన్షన్‌దారులు సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల తేదీల్లో మార్పు
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఫిబ్రవరి 4 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి నూతన షెడ్యూల్ ప్రకారం 10 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏకేయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.వి.ఎన్.రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన షెడ్యుల్ వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు వెంటనే విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. నూతన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న పేపరు–1, 11వ తేదీ పేపరు–2, 12న పేపరు–3, 13న మెథడాలజీ–1, 14న మెథాడాలజీ–2 (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ) పరీక్ష, 15న ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పేపరు నిర్వహించేందుకు నూతన షెడ్యుల్ విడుదల చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment