సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
అదో సినీ ఫక్కీలో జరిగిన ప్రీ ప్లాన్డ్ హత్య. పొదిలి సమీపంలో గత ఏడాది జరిగిన ఈ ఘటనపై తొలుత రోడ్డు ప్రమాదంగా గతేడాది ఫిబ్రవరి 24న కేసు నమోదైంది. పోలీసుల విచారణలో అది కారు ప్రమాద మరణం కాదు.. హత్య అని నిర్ధారించారు. కూలిపని చేసుకుని జీవించే చెల్లి మాలపాటి సంధ్య పేరుతో ముందుగానే సుమారు రూ.1.30 కోట్ల ఇన్సూరెన్స్ చేసి ఆపై ఆ నగదు కాజేసేందుకు మరి కొందరితో కలిసి సొంత అన్న మాలపాటి అశోక్‌రెడ్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు ఆ హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న కనిగిరి మండలం పునుగోడుకు చెందిన అశోక్‌రెడ్డిని పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. ఈమేరకు మరికొంత మంది ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాన్ని బలపరుస్తూ హతురాలు సంధ్య తల్లి కనిగిరికి చెందిన ముగ్గురిపై ఆరోపణలు చేసింది.
వారి వల్లే తన కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక ఉద్యోగి పేరుతో పాటు, కనిగిరి మండలానికి చెందిన మరో ఇద్దరు టీడీపీ నేతల (మాజీ సర్పంచ్‌లు) పేర్లను బహిర్గతం చేస్తూ ఆరోపించింది.
టీడీపీ నేత చుట్టూ సంధ్య హత్య కేసు..?
మృతురాలి తల్లి ఆరోపణలతో కనిగిరి మండలానికి చెందిన టీడీపీ నేతల పాత్ర విషయం వెలుగు చూసింది. దీంతో ఈ కేసు ఆద్యంతం కనిగిరికి చెందిన ఓ మాజీ సర్పంచ్ చుట్టూ తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన ముద్దాయి గా ఉండి హత్యోదంతంలో కీలకంగా వ్యవహరించిన హతురాలి అన్న మాలపాటి అశోక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.3.50 లక్షలు నగదు లంచం తీసుకుని ఫోరెన్సిక్ నివేదికలను తారుమారు చేయడంలో సహకరించిన పొదిలి ఆస్పత్రిలోని యూనస్‌ను కూడా రిమాండ్‌కు పంపించారు. అయితే యూనస్‌తో ముద్దాయిలకు లింక్ కలిపిన కనిగిరి మండలంలోని గురువాజీపేట ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో ఆ ఉద్యోగి కొన్ని బలమైన ఆధారాలు పోలీసులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ టీడీపీ నేత కోసం గాలింపు..?
ఈ హత్య కేసులో ఇంకా మరి కొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లి ఆరోపించిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లలో ఒకరి పాత్ర పూర్తి స్థాయిలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ఇద్దరిలో ఒకరు పూర్తిగా అండర్ గ్రౌండ్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అతని కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అయితే ఆ టీడీపీ నేత సంధ్య హత్యలో పాత్ర ధారుడా..? సూత్రధారుడా..? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
కనిగిరి టీడీపీ మాజీ సర్పంచ్ కోసం పోలీసుల గాలింపు పోలీసులకు దొరకాల్సింది..సూత్రధారా..? పాత్రధారా..?
Comments
Please login to add a commentAdd a comment