విజయసాయిరెడ్డివి నీచ రాజకీయాలు
ఒంగోలు సిటీ: విజయసాయిరెడ్డివి హీన రాజకీయాలని, ఆయన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పథకం ప్రకారమే వైఎస్సార్ సీపీపై, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేతగా కులాలకు అతీతంగా వైఎస్ జగన్ పనిచేస్తుంటే.. పార్టీలో ఉన్న సమయంలో కుల రాజకీయాలు చేసిందే విజయసాయిరెడ్డి అని ధ్వజమెత్తారు. పార్టీని అడ్డం పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి అడ్డగోలు ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఎంతో నమ్మకంగా పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే అక్కడ ఆయన చేసిన నిర్వాకం వల్ల పార్టీ భారీగా దెబ్బతిందని విమర్శించారు. విజయసాయిరెడ్డి చేస్తున్న తప్పులను గుర్తించి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించిన తర్వాతే ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారన్నారు. ఢిల్లీలో లాబీయింగ్‌కు అలవాటుపడిన విజయసాయిరెడ్డి అధికారం లేని వైఎస్సార్ సీపీలో ఉండలేక వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి బీజేపీతో అంటకాగాలనో, చంద్రబాబు భయం వలనో అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. అనవసరంగా వారిని వివాదాల్లోకి లాగి అక్కసు తీర్చుకుంటున్నారన్నారు. ఢిల్లీలో తన లాబీయింగ్‌కు అడ్డువస్తారనే ఉద్దేశంతో వై.వి.సుబ్బారెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేశారన్నారు. వై.వి.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం, అండర్‌పాస్‌లు, స్టాపింగ్ లేని స్టేషన్లలో పలు రైళ్లకు స్టాపింగ్ ఏర్పాటు వంటి పనులను ప్రతిపక్షంలో ఉండి కూడా చేశారన్నారు. గతంలో ఎవరూ చేయలేనన్ని పనులు వై.వీ.సుబ్బారెడ్డి చేశారని గుర్తు చేశారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన ఎంపీగా ఉండి ఉంటే ప్రకాశం జిల్లా దశ మారిపోయేదని, ఈ పాటికి పారిశ్రామికవాడ, ఎయిర్‌పోర్టు, వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చేవని అన్నారు. విజయసాయిరెడ్డి కుట్రలు చేసి వై.వి.సుబ్బారెడ్డిని పక్కన పెట్టించారన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీని వదిలిపెట్టి వెళ్లడం శుభపరిణామన్నారు.
విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడిచారు :
కె.వి.రమణారెడ్డి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచిన నీచమైన సంస్కృతి విజయసాయిరెడ్డిదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి మండిపడ్డారు. విజయసాయి చెప్పినట్టు వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్‌కు కోటరీ లేదని, కానీ కోటరీ పేరుతో విజయసాయిరెడ్డి పెత్తనం చలాయించారని దుయ్యబట్టారు. వ్యక్తిగత స్వార్థంతో వైఎస్సార్ సీపీని వీడిన ఆయన కూటమి నేతలను మెప్పించడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నష్టం కలిగించే చర్యలు విజయసాయిరెడ్డి మానుకోవాలన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిచి రెండోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయిరెడ్డి పార్టీని వదిలివెళ్లిపోయేవారా, ఇటువంటి విమర్శలు చేసేవారా అని ప్రశ్నించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలు చేయకుండా శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కె.వి.రమణారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి.. అధికారంలో లేనప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకట ప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, నాయకులు వై.వెంకటేశ్వరరావు, పట్రా ఐజాక్, షేక్ మీరావలి, జి.రజిని, దేవా, శ్రీకాంత్, పిగిలి శ్రీనివాసులు, ఏడుకొండలు, పి.వెంకయ్యనాయుడు, కయూమ్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు
Comments
Please login to add a commentAdd a comment