గురుకులాల నిర్వీర్యానికి కుట్ర
మొయినాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోడింగ్ అకాడమీని సందర్శించారు. విద్యార్థులుతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కోడింగ్ అకాడమీలో కోడింగ్ నేర్పించే ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని అకాడమిక్ చదువు చెప్పే ఉపాధ్యాయులు లేరని.. దీంతో 10వ తరగతి విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని.. 5వ తరగతిలో ప్రవేశాలు తీసుకోవడం నిలిపివేశారని విద్యార్థులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తొలి కోడింగ్ అకాడమీని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందించేలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను బలోపేతం చేస్తే అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారన్నారు. కోడింగ్ అకాడమీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి తప్పుడు సమాచారం ఇస్తున్నారని.. అందుకు నిదర్శనం అధికారులు చెప్పే తప్పుడు లెక్కలేనన్నారు. ప్రస్తుతం కోడింగ్ అకాడమీలో 218 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని... కానీ అధికారులు మాత్రం 540 మంది విద్యార్థులు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. కోడింగ్ అకాడమీలో సమస్యలు పరిష్కరించి యదావిధిగా కొనసాగించాలని.. గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, అవినాష్, నాయకులు ఆంజనేయులు, జయవంత్, డప్పు రాజు, సంజీవరావు, పరమేష్, ప్రవీణ్, సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్న గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment