
అమరుల ఆశయాలు సాధించాలి
మంచాల: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల ఆశయాలు సాధించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య అన్నారు. మండలంలోని జాపాల గ్రామంలో శనివారం కర్రె కోటప్ప స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి సాయుధ తెలంగాణ భూ పోరాటంలో కోటప్ప పాత్ర మరువలేనిదని తెలిపారు. దున్నే వాడికి భూమి కావాలని గ్రామాల్లో ఎర్ర జెండాలు పాతి భూ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రైతు, కూలీల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్య పర్చిన ఘనత సీపీఎంకే దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం కావాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని మార్పు దిశగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. ఉద్యమాల్లో ప్రజలందరినీ భాగస్వాములు చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా నాయకుడు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment