డబ్బు విషయంలో తలెత్తిన ఘర్షణ
కందుకూరు: డబ్బుల విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సరస్వతిగూడకు చెందిన మొలగాసి సుధాకర్(34) వ్యత్తిరీత్యా డ్రైవర్. అదే గ్రామానికి చెందిన సల్ల శమంత అలియాస్ శశికళకు అవసరాల నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఆయన డబ్బును అప్పుగా ఇచ్చాడు. తిరిగి తీసుకోవడానికి శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శశికళతో పాటు ఆమె తమ్ముళ్లు శేఖర్, వినయ్‌లతో సుధాకర్‌కు గొడవ జరిగింది. దీనిపై ఆమె కందుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తన తల్లి వసంతతో కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి అదే రోజు సాయంత్రం బైక్‌పై బయలుదేరాడు. గమనించిన శశికళ తమ్ముడు వినయ్ అతని బైక్‌ను అనుసరిస్తూ స్కూటీపై వస్తుండగా, లేమూరు గ్రామం దాటిన తర్వాత మరో తమ్ముడు శేఖర్ కాపు కాశాడు. అక్కడికి రాగానే సూధాకర్‌పై ఇద్దరు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి సుధాకర్ మృతిచెందాడని భావించి పరారయ్యారు. క్షతగాత్రుడిని తల్లి స్థానికుల సహాయంతో తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు సంబంధించి బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో టికెట్లను విక్రయిస్తున్న 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.