
లక్ష్యం బారెడు..
వసూలు మూరెడు
మొయినాబాద్: ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కొన్ని పురపాలక సంఘాలు పన్ను వసూలు ముందంజలో ఉంటే మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో అంతంతమాత్రంగానే టాక్స్ రికవరీ ఉంది. రూ.2.13 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. రెండు నెలల్లో కేవలం రూ.80 లక్షలే రికవరీ చేశారు. వంద శాతం పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఈ నెల 31 వరకు ఇంటింటికీ తిరుగుతున్నారు. అయినా మున్సిపాలిటీలో ఇప్పటివరకు 37 శాతమే పన్ను వసూలు కావడం గమనార్హం.
ఇదివరకు జీపీలే..
ఎనిమిది గ్రామ పంచాయతీలతో కలిపి మొయినాబాద్ మున్సిపాలిటీ మూడు నెలల క్రితం ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, సురంగల్, పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ గ్రామాలను కలిపి ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇదివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆయా గ్రామాల్లో పన్ను వసూలు పంచాయతీలు చేపట్టాయి. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడటంతో పంచాయతీల్లో వసూలు చేసిన పన్నులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం రూ.2,13,17,331 పన్నుల వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు రూ.80 లక్షలు వసూలు చేశారు. అంటే కేవలం 37 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన 63 శాతం పన్నులు వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇంటింటికీ తిరుగుతూ...
మున్సిపల్ కమిషనర్‌తోపాటు అధికారులంతా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజు ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వందశాతం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ప్రజలకు పన్నుల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నారు. పన్నులు చెల్లించాల్సిన జాబితాలో అధిక శాతం పెద్ద పెద్ద విద్యా సంస్థలు, రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లు, కన్వెన్షన్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలవే ఉన్నట్లు తెలుస్తుంది. వాటి నుంచి సైతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుని వెళ్తున్నారు.
వంద శాతం లక్ష్యం
మున్సిపల్ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇంటింటికి వెళ్లి వసూలు చేస్తున్నాం. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో అంతకుముందు చెల్లించిన పన్నులను మినహాయించి మిగిలినవాటినే టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఈ నెల 31 వరకు పన్నులు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి జరిమానాతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
– ఖజా మొయిజుద్దీన్, కమిషనర్,
మొయినాబాద్ మున్సిపాలిటీ
మొయినాబాద్‌లో 37 శాతమే పన్ను రికవరీ
ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు

లక్ష్యం బారెడు..

లక్ష్యం బారెడు..