బడంగ్‌పేట్: కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో హైడ్రా పంజా విసిరింది. రోడ్లను అక్రమించి నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేసి కాలనీవాసులకు విముక్తి కల్పించింది. వివరాలివీ.. అల్మాస్‌గూడలో బోయపల్లి కుటుంబీకులు 1982లో జీపీ లే అవుట్ చేశారు. కాలనీకి బోయపల్లి ఎన్‌క్లేవ్ అని పేరుపెట్టారు. సర్వే నంబర్ 39,40,41,42,44లో 5.7 ఎకరాల లే అవుట్ ఉండగా అందులో మూడు రోడ్లు, 236 గజాల పార్కు స్థలం చూపించి ప్లాట్లు విక్రయించారు. భూ యజమానులు మూడు లింక్ రోడ్లతో పాటు పార్కు జాగా ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్ర మించిన రోడ్ల స్థానంలో బాక్స్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. ఈ క్రమంలో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం హైడ్రా అధికారులు లే అవుట్‌ను పరిశీలించి కబ్జాను నిర్ధారించారు. గురువారం హైడ్రా సీఐ తిరుమలేశ్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
హైడ్రా సీఐపై దాడికి యత్నం
బాక్స్ క్రికెట్ స్టేడియంను కూల్చివేస్తుండగా ల్యాండ్ వర్గీయులు అడ్డుకునే యత్నం చేశారు. హైడ్రా సీఐ తిరుమలేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అదే రీతిలో సీఐ బదులివ్వడంతో భూ యజమానులు వెనక్కి తగ్గారు. హైడ్రా సిబ్బంది వెంటనే జేసీబీతో క్రికెట్ స్టేడియాన్ని ధ్వంసం చేసి చదును చేశారు. లేఅవుట్‌లో చూపించిన పార్కు స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇది పార్కు స్థలం అంటూ బోర్డు పాతించారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.
రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ స్టేడియం కూల్చివేత
మూసిన మూడు రోడ్లు, పార్కు స్థలానికి విముక్తి
హైడ్రా సీఐపై దాడికి ల్యాండ్ వర్గీయుల యత్నం
అల్మాస్‌గూడలో హైడ్రా పంజా