మొయినాబాద్: డెయిరీ ఫాంలో పెట్టుబడులు పెడితే ప్రతీ నెల కచ్చితమైన లాభాలు ఉంటాయని ప్రకటన ఇచ్చాడు.. పెట్టుబడులు ఆకర్షించి రూ.15 కోట్లు రాబట్టాడు.. ఆ తర్వాత బిచాణా ఎత్తేశాడు.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలివీ.. నగరానికి చెందిన వ్యాపారులు శ్రీనివాస్‌రావు, కోటేశ్వరరావు 2019లో అజీజ్‌నగర్ రెవెన్యూలో 15 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో కూరగాయలు, పూల తోటలతోపాటు డెయిరీ ఏర్పాటు చేస్తామని లీజు పత్రాల్లో రాసుకున్నారు. వారు లీజుకు తీసుకున్న భూమిలో కోటేశ్వరరావు బంధువైన వేముల సుబ్బారావు 2021లో కొండపల్లి డెయిరీ ఫాం పేరుతో డెయిరీ ఏర్పాటు చేశాడు. సుమారు 400 గేదెలతో డెయిరీని నడుపుతూ పాల ఉత్పత్తులు చేసేవారు. రెండేళ్ల క్రితం సుబ్బారావు డెయిరీలో పెట్టుబడులు పెడితే ప్రతి నెల కచ్చితమైన లాభాలు ఉంటాయని పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన కొంత మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. రూ.15 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటి నుంచి కొనసాగిన డెయిరీని పది రోజుల క్రితం సుబ్బారావు మూసివేశాడు. అందులోని గేదెలను రాత్రికి రాత్రే తరలించాడు. దీంతో రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన సాయి హరీష్ అనే వ్యక్తి ఈ నెల 17న మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం మరో ఎనిమిది మంది బాధితులు వేముల సుబ్బారావు, అతని భార్య కుమారి పెట్టుబడులు పెట్టించుకుని తమను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో ఆర్థిక నేరం జరిగిందని కేసును సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పెట్టుబడులు ఆకర్షించి.. బిచాణా ఎత్తేసి
రూ.15 కోట్ల వరకు టోకరా
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఆలస్యంగా వెలుగులోకి..
నేడు బాధితుల సమావేశం
అజీజ్‌నగర్‌లో డెయిరీ ఫాంలో పెట్టుబడులు పెట్టించుకుని మోసం చేసిన వేముల సుబ్బారావు మోసాలను ఆధారాలతో బయట పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. శుక్రవారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.