
పరిష్కారం కాక.. తిరగలేక !
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లికి చెందిన పాతూరి మహేశ్వరికి రాందాస్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 41/25లో మూడున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. కాసుల పహాణి, పైసలపట్టి, ఇతర రెవెన్యూ రికార్డుల్లోనూ పట్టా భూమిగా రికార్డయింది. ఈ సర్వే నంబర్‌లో వెయ్యి ఎకరాలకుపైగా భూమి ఉంది. ఓ అజ్ఞాత వ్యక్తి వేసిన కేసుతో అధికారులు (ఇదే సర్వే నంబర్‌లో ఓ రియల్టర్ వేసిన వెంచర్‌ను మినహాయించి చిన్న, సన్నకారు రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు) సర్వే నంబర్ మొత్తం బ్లాక్ చేశారు. రైతులందరి భూములను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. బాధితురాలు మహేశ్వరి నిషేధిత జాబితా నుంచి తమ భూమికి విముక్తి కల్పించాలని కోరుతూ 2023 ఆగస్టు 10న టీఎం 15 మాడ్యుల్ కింద దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇచ్చిన దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు బాధితురాలు తహసీల్దార్, ఆర్డీఓను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో 2025 ఫిబ్రవరి 22న మళ్లీ అదే మాడ్యుల్ కింద దరఖాస్తు చేసుకుంది. అయినా సంబంధిత అధికారుల నుంచి కనీస స్పందన లేదు. ఇంటి ఖర్చులు, ఇతర అవసరాల కోసం భూమిని అమ్ముకుందామంటే స్లాట్ బుక్‌కాని పరిస్థితి’. ఇదీ కేవలం మహేశ్వరికి ఎదురైన అనుభవం మాత్రమే కాదు.. జిల్లాలో 15,936 మంది భూ బాధితులు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా పట్టా భూములను అసైన్డ్ భూములుగా రికార్డు చేయడం.. ఒకరిద్దరు భూ యజమానుల మధ్య నెలకొన్న వివాదాన్ని మొత్తం సర్వే నంబర్‌కు ఆపాదించడం.. సరిహద్దు భూములను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చడం.. ఆ తర్వాత దళారుల ప్రమేయంతో వాటిని క్లియర్ చేయడం రెవెన్యూ యంత్రాంగానికి పరిపాటిగా మారింది.
అదనపు కలెక్టర్ వద్దే అత్యధికంగా పెండింగ్
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 12 లక్షల ఎకరాలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్, లావణి పట్టా భూములు ఉన్నాయి. పహాణీల ఆధారంగా ఆయా భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. పొజిషన్‌లో ఉన్న భూమికి, రికార్డుల్లో నమోదైన భూములకు పొంతనే లేదు. భూమికి మించి రికార్డులు ఉండటం, రైతుల పేరున పట్టాదారు పాసు పుస్తకాలు ఉండటం అధికారులను ఇక్కట్లకు గురి చేసింది. కొంతమంది అధికారులు రియల్టర్లు, డెవెలపర్లతో కుమ్మకై ్క పట్టా భూములను అసైన్డ్ భూములుగా, సీలింగ్ భూములను పట్టా భూములుగా పోర్టల్‌లో నమోదు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. భూములు నిషేధిత జాబితాలో ఉన్న విషయం తెలిసి.. జాబితా నుంచి వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ భూ యజమానుల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఇలా ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌కు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో మెజార్టీ దరఖాస్తులను కలెక్టర్ క్లియర్ చేశారు. కొన్ని వివాదాలు అలాగే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పటి వరకు కేవలం కలెక్టర్ లాగిన్‌లోనే పరిష్కారమయ్యే ధరణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తహసీల్దార్, ఆర్‌డీఓ, అదనపు కలెక్టర్‌లకు లాగిన్ సౌలభ్యం కల్పించి, వారి పరిధిలో పలు అంశాలకు పరిష్కారమార్గం చూపేలా చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో కాసులకు కక్కుర్తి పడి.. గత అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భూపాల్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ బాధ్యతలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బాధ్యతలు, అటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో పని భారం కారణంగా మెజార్టీ దరఖాస్తులు అదనపు కలెక్టర్ వద్దే పెండింగ్‌లో ఉండిపోయాయి. బాధితులు ఆయా రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ధరణిలో 15,936 దరఖాస్తులు పెండింగ్
నిషేధిత జాబితా, తప్పుల సవరణ ఎక్కువ
ఏళ్లుగా బాధితుల ఎదురుచూపులు
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
పట్టించుకోని జిల్లా రెవెన్యూ యంత్రాంగం