
భూమి దక్కదనే కక్షతోనే..
సుపారీ ఇచ్చి హత్య చేయించిన దాయాదులు
● కారు ఢీకొట్టి మృతి చెందిన కేసును ఛేదించిన పోలీసులు
● వివరాలు వెల్లడించిన సీఐ వెంకటేశ్వర్లు
మహేశ్వరం: భూమిపై అత్యాశే ప్రాణాలు తీసింది. ఐదెకరాల పొలం తమకు దక్కదనే కక్షతో దాయాదిని సుపారీ ఇచ్చి కారుతో ఢీకొట్టి హత్య చేయించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్య(60)కు తన దాయాదులైన గూడెపు నర్సింగ్‌రావు, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌లతో తండ్రుల కాలం నుంచి భూ తగాదాలున్నాయి. ప్రస్తుతం అవి కోర్టులో నలుగుతున్నాయి. ఇటీవల శంకరయ్యకు అనుకూలంగా ఐదు ఎకరాల భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. దీంతో వివాదాస్పదమైన భూమిలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఇది రుచించని దాయాదులు ఎలాగైన ఆయన్ని మట్టుబెట్టాలని పథక రచన చేశారు. ఇందుకు అదే గ్రామానికి చెందిన కొండని ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నారు. తనకున్న రూ.12 లక్షల అప్పు తీర్చడంతో పాటు ఇల్లు నిర్మిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2న మధ్యాహ్నం బైక్‌పై శంకరయ్య వెళుతుండగా ప్రశాంత్ కారులో వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్, కాల్‌డాటా ఇతర వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ముందుగానే పోలీసులు కారు డ్రైవర్ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వాస్తవాలు చెప్పాడు. ఈ మేరకు నిందితులు గూడెపు నర్సింగ్‌రావు, బక్కని కార్తీక్(నర్సింగ్ రావు బామ్మర్ది), గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. హత్య కేసును ఛేదించిన మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మధుసూదన్, క్రైమ్ కానిస్టేబుళ్లను డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి అభినందించారు.